ఏపీ సీఎం వైయస్ జగన్ సంచలన నిర్ణయం: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అమలు

By Nagaraju penumalaFirst Published Jul 2, 2019, 7:52 PM IST
Highlights


రాష్ట్రంలో ఇళ్లులేని వారు ఒక్కరు కూడా ఉండకూడదని ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారుడు రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా నిర్ణయం తీసుకున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి నిర్మాణాలు జరగకుండా త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ హౌసింగ్ ప్లాట్స్ నిర్మాణంపై రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటి వరకు ప్రాజెక్టులపై రివర్స్ టెండరింగ్ కు వెళ్తానని పదేపదే హెచ్చరించిన వైయస్ జగన్ తొలిసారిగా రివర్స్ టెండరింగ్ కు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఏదైతే సాంకేతికతతో నిర్మాణాలు కొనసాగుతున్నాయో అదే సాంకేతికతతో రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. 

వీలైనంత ఎక్కువమంది రివర్స్ టెండరింగ్ లో పాల్గొనేలా చూడాలని సూచించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా వీలైనంత ఆదా చేయాలని అధికారులకు సూచించారు. షేర్ వాల్ టెక్నాలజీ పేరుతో గత ప్రభుత్వం పేదలపై భారం మోపిందని అలాంటిది తమ ప్రభుత్వంలో జరగకూడదంటూ అధికారులకు ఆదేశించారు. 

గత ప్రభుత్వం గృహనిర్మాణంలో అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. అలాగే ప్రతీ లబ్ధిదారుడుకు రూ.3లక్షలు ఖర్చు అయ్యేలా చేసిందని జగన్ గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రతీ ఒక్కరికి ఇళ్లు ఉండాలని అది కూడా నాణ్యమైన ఇళ్లు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. 

రాష్ట్రంలో ఇళ్లులేని వారు ఒక్కరు కూడా ఉండకూడదని ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారుడు రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా నిర్ణయం తీసుకున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి నిర్మాణాలు జరగకుండా త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

ఇకపై గృహనిర్మాణాలు పారదర్శకంగా ఉంటాయని తెలిపారు. రివర్స్ టెండరింగ్ వల్ల కాంట్రాక్టర్ లను వేధించడం అనుకోవద్దు అన్నారు. ప్రభుత్వ ఖజానాకు మేలు కలగడమే తమ లక్ష్యమని వైయస్ జగన్ గృహనిర్మాణ శాఖ రివ్యూలో స్పష్టం చేశారు. 

click me!