‘ ఫ్యాన్ ’ ఇంట్లో వుండాలి.. ‘ సైకిల్ ’ బయట వుండాలి, తాగేసిన ‘ గ్లాస్ ’ సింక్‌లో వుండాలి : జగన్ పంచ్‌లు

Siva Kodati |  
Published : Feb 18, 2024, 05:40 PM ISTUpdated : Feb 18, 2024, 05:45 PM IST
‘ ఫ్యాన్ ’ ఇంట్లో వుండాలి.. ‘ సైకిల్ ’ బయట వుండాలి, తాగేసిన ‘ గ్లాస్ ’ సింక్‌లో వుండాలి : జగన్ పంచ్‌లు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆవేశంగా ప్రసంగించారు. విపక్ష నేతలు చంద్రబాబు , పవన్ కళ్యాణ్‌లపై ఆయన పంచ్‌లు విసిరారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆవేశంగా ప్రసంగించారు. విపక్ష నేతలు చంద్రబాబు , పవన్ కళ్యాణ్‌లపై ఆయన పంచ్‌లు విసిరారు. చంద్రబాబు పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్క పథకం కూడా లేదన్నారు జగన్. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, మనకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు. వీళ్లెవరూ మన రాష్ట్రంలో వుండరు, అప్పుడప్పుడు వస్తుంటారని జగన్ ఎద్దేవా చేశారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పది శాతమైనా అమలు చేశారా అని ప్రశ్నించారు.  మళ్లీ అబద్ధాలు , మోసాలతో చంద్రబాబు వస్తున్నారని .. పెత్తందారులతో యుద్ధానికి మీరు సిద్ధమా అని జగన్ నిలదీశారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏ ప్రాంతానికైనా న్యాయం చేశారా అని ఆయన దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకు అని సీఎం ప్రశ్నించారు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలేనని.. విశ్వసనీయతకు , వంచనకు మధ్య యుద్ధం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. 

కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బాబు మార్క్ ఎక్కడైనా వుందా అని జగన్ ప్రశ్నించారు. 1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టలో 10 శాతమైనా అమలు చేశారా అని ఆయన నిలదీశారు. రంగు రంగుల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు వస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం ఎవరికీ గుర్తురాదని.. 57 నెలల పాలనలో చిత్తశుద్ధితో పాలన అందించామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అబద్ధాలను నమ్మొద్దని ప్రతీ ఇంటికీ వెళ్లి చెప్పాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతీ అవ్వాత, తాత ముఖంలో చిరునవ్వులు చూశామని.. ప్రతీ అక్కచెల్లెమ్మకు ఎంతో మేలు చేశామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 

57 నెలల పాలనలో జరిగిన మంచిని ప్రజలందరికీ వివరించాలని.. 57 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. చేసినవి చెప్పాలి, వాటి కొనసాగింపు ఎంత అవసరమో చెప్పాలన్నారు. రైతులకు రైతుభరోసా తీసుకొచ్చి ఇచ్చామని.. రైతన్నకు పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెని చంద్రబాబు లాక్కుంటారని.. చంద్రబాబు మోసాలను ప్రతీ రైతన్నకు వివరించాలన్నారు. వైఎస్సార్‌సీపీ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఎన్నో పథకాలు గుర్తొస్తాయన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మనదని జగన్ పేర్కొన్నారు. ప్రతీ అక్కచెల్లెమ్మ ఫోన్‌లో దిశ యాప్ తీసుకొచ్చామన్నారు.

సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలని జగన్ పేర్కొన్నారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే వుండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే వుండాలని , తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే వుండాలని సీఎం సెటైర్లు వేశారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా నాడు నేడుతో మార్పులు తెచ్చామని జగన్ పేర్కొన్నారు. విద్యావ్యవస్ధలో సమూల మార్పులు తీసుకొచ్చామని.. పేద విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చామని సీఎం వెల్లడించారు. విద్యాదీవెన, వసతి దీవెనతో విద్యార్ధులకు అండగా నిలిచామని.. పెత్తందారుల పిల్లలతో మన పిల్లలు పోటీపడాలంటే మళ్లీ మన ప్రభుత్వమే రావాలని జగన్ స్పష్టం చేశారు.  మన పిల్లలు ప్రపంచ స్థాయికి ఎదిగేలా విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చామని.. పెన్షన్ కొనసాగాలంటే మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే రావాలని జగన్ తెలిపారు. 

మీ అన్న ప్రభుత్వమే సంక్షేమ పథకాలను కొనసాగించగలదని.. జరుగుతున్న మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వమే రావాలని ఆయన అన్నారు. వైసీపీ పేరు చెబితే ఎన్నో సంక్షేమ పథకాలు గుర్తొస్తాయని.. కోవిడ్ కష్టకాలంలోనూ అందించిన సేవలు గుర్తొస్తాయని జగన్ పేర్కొన్నారు. పెన్షన్ కొనసాగాలంటే మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే రావాలని.. మీ అన్న ప్రభుత్వమే సంక్షేమ పథకాలను కొనసాగించగలదని సీఎం తెలిపారు. లంచాలకు తావు లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో వేశామని.. మీ బిడ్డ 125 సార్లు బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నిధులు జమ చేశాడని ఆయన అన్నారు. రూ.2.25 లక్షల కోట్లు నేరుగా ఖాతాల్లో వేశామని.. వైసీపీ మార్క్ ప్రతీ ఇంట్లోనూ కనిపిస్తోందని జగన్ వెల్లడించారు. 

ఒక్కసారి ఛాన్స్ ఇస్తేనే ఇంత మంచి చేశామని చెప్పాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మళ్లీ అవకాశమిస్తే ఇంకెంత మంచి జరుగుతుందో ఆలోచించమని చెప్పాలన్నారు. 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీలకు పదవుల్లో ప్రాధాన్యతనిచ్చామని జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. కేవలం 57 నెలల కాలంలోనే 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. నిరుపేద వర్గాలకు 80 శాతం ఉద్యోగాలు ఇచ్చామని.. మేనిఫెస్టోను  మీ బిడ్డ మాదిరిగా అమలు చేసిన వారెవరైనా వున్నారా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటేయాలని ఆయన నిలదీశారు. జగన్‌కు జనబలం లేకుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర ఎందుకు అంటూ సీఎం చురకలంటించారు. సైకిల్‌ను తొయ్యడానికి ప్యాకేజ్ స్టార్ ఎందుకు.. ప్రజల కోసం నేను 125 సార్లు బటన్ నొక్కానని జగన్ తెలిపారు. 

మళ్లీ ఫ్యాన్‌కు ఓటేస్తే చంద్రముఖి బెడద ఇక మీకుండదని.. సైకిల్‌కు ఓటేస్తే పేదల రక్తం తాగేందుకు చంద్రముఖి వస్తుందని ఆయన హెచ్చరించారు. మీ ఇంట్లో మంచి జరిగితే జగనన్నకు ఓటు వేయమని చెప్పాలని.. టీడీపీ దేనికి సంసిద్ధమని జగన్ దుయ్యబట్టారు. పేదవాడి బతుకు మార్చేందుకు మనం యుద్ధం చేస్తున్నామని.. చంద్రబాబు పెత్తందారుల తరపున సంసిద్ధం అంటున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దుష్టచతుష్టం బాణాలకు తలవంచేందుకు ఇక్కడ వున్నది అభిమన్యుడు కాదు.. ఇక్కడ వున్నది అర్జునుడని, అతనికి తోడు కృష్ణుడి రూపంలో ప్రజలున్నారని జగన్ పేర్కొన్నారు. వైసీపీ మీ అందరి పార్టీ అని.. మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదని, ప్రజలతోనే మా పొత్తు అని సీఎం స్పష్టం చేశారు. 

గతంలో లంచాలు పిండుతూ తన వారికే పథకాలిచ్చారని జగన్ ఆరోపించారు. పార్టీలో ప్రతీ కార్యకర్తకూ మీ అన్న జగన్ తోడుగా వుంటాడని హామీ ఇచ్చారు. నాయకుడంటే ప్రతీ కార్యకర్తా కాలర్ ఎగరేసేలా వుండాలని.. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175 అని జగన్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25కి 25 ఎంపీ స్థానాలని సీఎం తెలిపారు. 650 హామీలిచ్చి 10 శాతం కూడా చంద్రబాబు అమలు చేయలేదని .. మేనిఫెస్టోలో వైసీపీ 99 శాతం హామీలు అమలు చేసిందని జగన్ వెల్లడించారు. 

ఎల్లో మీడియా దుష్ప్రచారాలను తిప్పికొట్టేందుకు మీరు సిద్ధమా అని ఆయన ఉత్సాహం నింపారు. ఎల్లో మీడియా చీకటి రాతలను తిప్పికొట్టేందుకు మీరు సిద్ధమా అని జగన్ ప్రశ్నించారు. సమరభేరి మోగిద్దాం.. సమరనినాదం వినిపిద్దామన్నారు. మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమా అని సీఎం ప్రశ్నించారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవని.. పెత్తందారులంతా తోడేళ్లుగా ఏకమవుతున్నారని ఆయన చురకలంటించారు. ఈ ఎన్నికలు చాలా కీలకమని.. పొరపాటు జరిగితే పేదవాడి బతుకు అతలాకుతలమవుతుందని జగన్ హెచ్చరించారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్