
అమరావతి :కేంద్ర ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి) చట్టం తీసుకురావాలని చూస్తున్న నేపథ్యంలో ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ మత విశ్వాసాలను పట్టించుకోకుండా కేంద్ర ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ ముస్లిం మతపెద్దలు యూసిసి చట్టాన్న తీవ్రంగా వ్యక్తిరేకిస్తున్నారు. ఈ క్రమంలో యూసీసీ చట్టం గురించి చర్చించేందుకు ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు ఏపీ సీఎం జగన్. వైసిపి ముస్లిం ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో పాటు ఇస్లాం మత పెద్దలతో ముఖ్యమంత్రి దాదాపు మూడు గంటలపాటు సమావేశమై కూలంకశంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష మాట్లాడుతూ... యూసీసీ బిల్లు తెస్తున్నారనే సమాచారంతో దేశవ్యాప్తంగా ముస్లింలలో అభద్రతాభావం నెలకొందని అన్నారు. యూసీసీ చట్టం ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం మత పెద్దలు సీఎంకు తెలిపారన్నారు. వైసిపి ప్రభుత్వం మైనార్టీలకు అండగా వుంటుందని... వారికి నష్టం జరగకుండా తాను ముందుండి పోరాడతానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ముస్లింలు ఎవరూ అభద్రతకు గురికావద్దని, అధైర్యపడవద్దు... యూసిసి చట్టం ముస్లింలకు నష్టం కలిగించేలా వుంటే తప్పకుండా పార్లమెంట్ లో ఆ బిల్లును వ్యతిరేకిస్తామని సీఎం తెలిపారని డిప్యూటీ సీఎం వెల్లడించారు.
మైనార్టీలకు తాను అండగా ఉంటానని సీఎం హామీ ఇవ్వడంతో మత పెద్దలు సంతోషం వ్యక్తం చేశారన్నారు. దేశ ఔనత్యానికి విఘాతం కల్గించేలా ఉంటే బిల్లును తప్పకుండా అడ్డుకుంటామని సీఎం చెప్పారని... ముస్లింలు ఎవరూ అధైర్యపడవద్దని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సూచించారు.
Read More మీ మరిది హయాంలో జరిగినవి గుర్తులేవా?.. పురందేశ్వరికి మంత్రి అమర్నాథ్ కౌంటర్..
కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ... యూసీసీ వల్ల జరిగే నష్టాలపై మాతో సీఎం చర్చించారని అన్నారు. ముస్లింలకు ఎల్లపుడూ తోడుగా, అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారన్నారు. తాను మైనార్టీ పక్షపాతినని... యూనిఫాం సివిల్ కోడ్ చట్టాన్ని వ్యతిరేకిస్తామని సీఎం స్పష్టంగా చెప్పినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.