
భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఒకరిద్దరు సర్వేయర్లు మాత్రమే వున్నారని చెప్పారు. అయితే ఏపీలో మాత్రం ప్రతి గ్రామ సచివాలయంలోనూ సర్వేయర్లు వున్నారని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
రిజిస్ట్రేషన్ వ్యవస్ధను నేరుగా గ్రామ సచివాలయాలకు తీసుకొస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించామని.. తాజాగా ఇంటి నుంచే రిజిస్ట్రేషన్ చేయించుకునేలా సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నామని సీఎం వెల్లడించారు. భూ వివాదాలను పరిష్కరించడానికి మండల స్థాయిలో మొబైల్ కోర్టులు నడిచేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు.
ALso Read: ఇక నుంచి కౌలు రైతులకూ పెట్టుబడి సాయం.. రేపు ప్రారంభించనున్న సీఎం జగన్..
భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వానికి ఈ వ్యవస్థ ఎంతగానో వుపయోగపడుతోందన్నారు. ప్రజలకు మేలు చేస్తున్న నిర్ణయాలపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు జరుగుతున్న నిర్ణయాలను కూడా వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని.. వీటిని తిప్పికొట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.