
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతికి చోటు వుండకూడదన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో జగన్ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్ధవంతంగా అమలు చేయాలని.. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్‌ల పనితీరు ఈ విషయంలో కీలకమన్నారు. బాధితులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా టెలిఫోన్ నెంబర్‌ను అందుబాటులో వుంచాలని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేయాలని.. ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని జగన్ సూచించారు. నాలుగు వారాలకు మించి ఎక్కడా ఖాళీ వుండకూడదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఇకపోతే.. గతేడాది అక్టోబర్ 22న ప్రారంభమైన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తర్వాత ఇప్పటి వరకు 1,39,97,189 మందికి సేవలు అందించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీరిలో 35,79,569 మంది హైపర్ టెన్షన్‌తో.. 24,31,934 మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు చెప్పారు. అయితే రోగులకు చికిత్స అందించడంతో పాటు వారికి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు వాకబు చేయాలని జగన్ ఆదేశించారు. టీబీ నివారణపైనా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలపగా.. బాధితుల్ని గుర్తించి పరీక్షలు చేయించాలని జగన్ ఆదేశించారు.
ప్రతి కుటుంబంలో పుట్టిన బిడ్డ నుంచి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్డ్‌కి క్యూ ఆర్ కోడ్ వున్న నేపథ్యంలో వారి ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. అటు రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న కొత్త మెడికల్ కాలేజీలపైనా జగన్ ఆరా తీశారు. ఈ కాలేజీలు చరిత్రలో నిలిచిపోయేలా వుండాలని, ఇందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.