కరోనాతో ఉచిత విద్యుత్ కు అంతరాయం...అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

By Arun Kumar PFirst Published May 1, 2020, 7:51 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

అమరావతి: కరోనా వైరస్ కారణంగా రైతులకు అందించే ఉచిత విద్యుత్ కు అంతరాయం కలిగిందని... గత ఖరీఫ్‌లో 58శాతం ఫీడర్లలో 9 గంటలపాటు రైతులకు పగటిపూట విద్యుత్‌ ఇవ్వగలిగామని అధికారులు ముఖ్యమంత్రి జగన్ కు తెలిపారు.  ఈ ఖరీఫ్‌లో 81శాతం ఫీడర్లలో 9 గంటలపాటు పగటిపూట విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కోవిడ్‌ –19 కారణంగా సప్లైయిస్ కి ఇబ్బంది కలిగిందని, దీనివల్ల మిగిలిన 19శాతం ఫీడర్లలో పనులు మందగించాయని సీఎంకు తెలిపారు అధికారులు. 

విద్యుత్‌రంగంపై సీఎం వైఎస్‌.జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌పైన అధికారులతో చర్చించినసీఎం కరోనా ప్రభావం విద్యుత్ రంగంపై పడకుండా చూడాలని ఆదేశించారు. పనులు పూర్తిచేసి వచ్చే రబీనాటికి 100శాతం ఫీడర్లలో 9 గంటలు పగటిపూట కరెంటు ఇవ్వాలని అధికారులకు సీఎం స్పష్టంచేశారు. 

10వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ప్లాంట్‌ ఏర్పాటుపై  సీఎం అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుకోసం ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను వివరించిన అధికారులు మే నెలాఖరు నాటికి పనులు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 

సీఎంతో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, జెన్ కో చైర్మన్ సాయిప్రసాద్, జెన్‌కో ఎండీ బి.శ్రీధర్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లంతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.  
 
 

click me!