ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలపై... గవర్నర్‌, హైకోర్టును ఆశ్రయించండి..: అధికారులకు జగన్ ఆదేశం

Arun Kumar P   | Asianet News
Published : Mar 17, 2021, 05:19 PM IST
ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలపై... గవర్నర్‌, హైకోర్టును ఆశ్రయించండి..: అధికారులకు జగన్ ఆదేశం

సారాంశం

ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ పై అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.   

అమరావతి: దేశవ్యాప్తంగా మరోపసారి కరోనా వ్యాప్తి ఎక్కువయిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పాల్గొన్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఎన్నికల ప్రక్రియ భంగకరంగా మారింది జగన్‌ పేర్కొన్నారు. అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో మునిగిపోయిందని... అందువల్లే వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోందన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ప్రక్రియలో ఇక ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉందని.. మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇవికూడా జరిగిపోయి ఉంటే బాగుండేదన్నారు. కానీ అలా జరగలేదని... జాప్యం జరుగుతూ వస్తోందన్నారు. 

''ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మిగిలిపోయిన కేవలం 6రోజుల ఎన్నికల ప్రక్రియను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియ పూర్తైతే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లవచ్చు. లేకపోతే వైరస్‌ వ్యాపిస్తున్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ చేయడం, ఆయా ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించడం... ఇవన్నీకూడా కష్టం అవుతాయి'' అని జగన్ పేర్కొన్నారు. 

''మిగిలిపోయిన ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి అధికారులు ప్రయత్నించాలి. ప్రభుత్వం తరఫున అధికారికంగా గవర్నర్‌కు, హైకోర్టుకు నివేదించాలి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, దేశవ్యాప్తంగా మళ్లీ కేసులు పెరుగుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో మిగిలిపోయిన ఆ 6 రోజుల ప్రక్రియను వేగంగా పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరాలి'' అని జగన్ సూచించారు. 

read more   సీన్ రివర్స్: నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద వైఎస్ జగన్ ఒత్తిడి

''ప్రజారోగ్యం దృష్ట్యా దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న రీత్యా ఎన్నికలు పూర్తవడం అత్యంత అవసరం. ఎన్నికలు ముగిస్తే వ్యాక్సినేషన్‌పై యంత్రాంగం తదేక దృష్టిపెట్టేందుకు అవకాశం ఉంటుంది. వ్యాక్సినేషన్‌ను ఉద్ధృతంగా చేపట్టే కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయాలను యూనిట్‌గా తీసుకోవాలి. సంబంధిత సచివాలయం పరిధిలో ఉన్నవారికి వ్యాక్సినేషన్‌ను పూర్తిచేయడంపై దృష్టిపెట్టి, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి'' అని అధికారులకు సీఎం ఆదేశించారు. 

''45 ఏళ్లకు పైబడి, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్లు సత్వరమే అందించాలి. వైరస్‌ సోకినవారికి చికిత్స అందించడం కన్నా ఆ వైరస్‌రాకుండా నివారణా పద్ధతులపై దృష్టిపెట్టాలి. వ్యాక్సినేషన్‌పై సమగ్ర కార్యాచరణతో ముందుకు రావాలి. అలాగే కోవిడ్‌ పరీక్షల సంఖ్యను పెంచాలి. కోవిడ్‌ పరీక్షలన్నీకూడా పూర్తిస్థాయిలో నూటికి నూరుశాతం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి'' అని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. 

ఈ సమీక్షా సమావేశంలో  డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్, హోంమంత్రి మేకతోటి సుచరిత, చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!