రైతులకు శుభవార్త... అతి తక్కువ వడ్డీలకే రుణాలు..: బ్యాంకులకు సీఎం జగన్ ఆదేశం

Arun Kumar P   | Asianet News
Published : Feb 24, 2022, 04:46 PM IST
రైతులకు శుభవార్త... అతి తక్కువ వడ్డీలకే రుణాలు..: బ్యాంకులకు సీఎం జగన్ ఆదేశం

సారాంశం

క్యాంపు కార్యాలయంలో సహకార శాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డీసీసీబీలు, సొసైటీల బలోపేతం, కంప్యూటరైజేషన్, పారదర్శక విధానాలు, ఆర్బీకేలతో అనుసంధానం తదితర అంశాలపై చర్చించారు.

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (cooperative banks) పనితీరు, వాటి బ్రాంచ్‌లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పనితీరును సహకార శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి డీసీసీబీలు, సొసైటీల బలోపేతం, కంప్యూటరైజేషన్, పారదర్శక విధానాలు, ఆర్బీకేలతో అనుసంధానం తదితర అంశాలపై చర్చించారు. సహకార బ్యాంకుల బలోపేతంపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు.   

''సహకార బ్యాంకులు మన బ్యాంకులు, వాటిని మనం కాపాడుకోవాలి. ఈ బ్యాంకుల వల్ల తక్కువ వడ్డీలకు రుణాలు వస్తాయి... దీనివల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుంది. తక్కువ వడ్డీకి ఇవ్వడానికి ఎంత వెసులుబాటు ఉంటుందో అంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి. బ్యాకింగ్‌ రంగంలో పోటీని ఎదుర్కొనెలా డీసీసీబీలు, సొసైటీలు ఉండాలి. ఈ పోటీని తట్టుకునేందుకు ఆర్షణీయమైన వడ్డీరేట్లతో రుణాలు ఇవ్వండి'' అని అధికారులకు సీఎం సూచించారు. 

''నాణ్యమైన రుణసదుపాయం ఉంటే బ్యాంకులు బాగా వృద్ధిచెందుతాయి. మంచి ఎస్‌ఓపీలను పాటించేలా చూడాలి. డీసీసీబీలు పటిష్టంగా ఉంటేనే రైతులు మేలు పొందుతారు. కాబట్టి డీసీసీబీలు లాభాల బాట పట్టేలా చూడాలి'' అని సూచించారు. 

''బంగారంపై రుణాలు ఇచ్చి మిగిలిన బ్యాంకులు వ్యాపారపరంగా లబ్ధి పొందుతున్నాయి. రుణాలపై కచ్చితమైన భద్రత ఉన్నందున వాటికి మేలు చేకూరుతోంది. ఇలాంటి అవకాశాలను సహకార బ్యాంకులు కూడా సద్వినియోగం చేసుకోవాలి. – వాణిజ్య బ్యాంకులు, ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు ఇవ్వడం ద్వారా ఖాతాదారులను తమవైపుకు తిప్పుకోవచ్చు. తద్వారా అటు ఖాతాదారులకు, ఇటు సహకార బ్యాంకులకు మేలు జరుగుతుంది'' అని సూచించారు.

''మా ప్రభుత్వంలో వ్యవసాయ రంగంలో ఆర్బీకేల్లాంటి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఈ రంగంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకనే వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రుణాల మంజూరులో ఎక్కడా రాజీ ఉండకూడదు, రాజకీయాలకు చోటు ఉండకూడదు. అవినీతికి, సిఫార్సులకు తావులేకుండా కేంద్ర సహకార బ్యాంకులు కార్యకలాపాలు సాగాలి. నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అన్నది చాలా ముఖ్యం. పాలనలో సమర్థతతో పాటు, అవినీతి లేకుండా ఉంటేనే, నాణ్యమైన సేవలు అందితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. లేదంటే... ప్రజలకు నష్టం వాటిల్లుతుంది'' అని పేర్కొన్నారు. 

''సహకార బ్యాంకుల్లో ఖాతాదారులకు విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌)బ్యాంకింగ్‌ కార్యకలాపాలు ఆర్బీకేల ద్వారా సాగాలి. ఆమేరకు పీఏసీఎస్‌లను మ్యాపింగ్‌చేసి... వాటి కింద వచ్చే ఆర్బీకేలను నిర్ణయించాలి. ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కార్యకలాపాలను పీఏసీఎస్‌లతో అనుసంధానం చేయాలి. ఇప్పటికే ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు ఉన్నారు. వీరు రైతులకు, బ్యాంకులకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించాలి. అంతిమంగా, ఆర్బీకేలు, ఆర్బీకేల్లోని బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు రైతులకు, బ్యాంకులకు మధ్య ప్రతినిధులుగా వ్యవహరిస్తారు.
ఈ వ్యవస్థ ఎలా ఉండాలన్న దానిపై అధికారులు బ్యాంకింగ్‌ నిపుణులతో మాట్లాడి ఒక విధానాన్ని రూపొందించాలి'' అని సీఎం ఆదేశించారు. 

''జిల్లాకేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల్లో చక్కటి యాజమాన్య విధానాలను తీసుకురావాలి. అంతిమంగా ప్రతి ఎకరా సాగుచేస్తున్న ప్రతిరైతుకూ మేలు జరగాలి. ఈ లక్ష్యం దిశగా సొసైటీలను నడిపించాలి. ఇందుకోసం ప్రతిపాదనలను మరింత మెరుగ్గా తయారుచేసి తనకు నివేదించాలి. వ్యవసాయ సలహామండళ్ల సమావేశాల్లో బ్యాకింగ్‌ రంగంపై రైతులనుంచి వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూచనలు కూడా స్వీకరించి దానిపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలి'' అని సీఎం ఆదేశించారు. 

''ఆర్బీకేల్లో ఉన్న కియోస్క్‌లను సమర్థవంతంగా వాడుకోవాలR. బ్యాంకింగ్‌ కార్యకలాపాల్లో కూడా కియోస్క్‌లను సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు సంబంధించి డాక్యుమెంట్లను కియోస్క్‌ల ద్వారా అప్‌లోడ్‌ చేసే సదుపాయంకూడా ఉండాలి. ఈమేరకు కియోస్క్‌ల్లో మార్పులు చేర్పులు చేయాలి'' అని సీఎం జగన్ సహకారశాఖ అధికారులకు సూచించారు. 
 

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu