చిరంజీవి ట్వీట్ కు రిప్లై, జగన్ 'మెగా' ప్లాన్: పవన్ కల్యాణ్ కు షాక్, ఊహాగానాలు ఇవీ...

By telugu teamFirst Published Jun 24, 2021, 8:43 AM IST
Highlights

కరోనా వాక్సినేషన్ విషయంలో తనను ప్రశంసించిన మెగాస్టార్ చిరంజీవికి ఏపీ సీఎం వైఎస్ జగన్ సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో చిరంజీవికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, మెగాస్టార్ చిరంజీవికి మధ్య సత్సంబంధాలు కొనసాగుతుున్నాయి. చిరంజీవి చేసిన ట్వీట్ కు జగన్ ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు ఒక్క రోజులో 13.72  లక్షల మందికి పైగా కరోనా వాక్సిన్ ఇచ్చిన విషయంపై జగన్ ను ప్రశంసిస్తూ అంతకు ముందు చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు జగన్ సమాధానం ఇచ్చారు. 

తమను ప్రశంసించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్ ధన్యవాదాలు తెలిపారు. గ్రామ, వార్డు కార్యదర్శులు, పీహెచ్ సీ వైద్యులు, మండలాధికారులు, జిల్లా అధికారులు, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు సమిష్టిగా పనిచేయడం వల్ల అది సాధ్యమైందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో చిరంజీవికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో చిరంజీవిని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున రాజ్యసభకు పంపుతారనే ప్రచారం ఊపందకుంది. తద్వారా జనసేన అధినేత, చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ కు జగన్ షాక్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. పవన్ కల్యాణ్ కు చెందిన జనసేన జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. బిజెపితో పొత్తు పెట్టుకుని ఆయన వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. 

చిరంజీవిని రాజ్యసభకు పంపించడం ద్వారా పవన్ కల్యాణ్ కు బలం తగ్గుతుందని, పవన్ కల్యాణ్ ను బలపరిచేవారు చీలిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిజానికి చిరంజీవి తొలి నుంచి కూడా జగన్ తో మంచి సంబంధాలనే కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్ ను చిరంజీవి కలిశారు. సినీ పరిశ్రమ నుంచి దాదాపుగా జగన్ ను తొలిసారి కలిసింది చిరంజీవే. ఆ తర్వాత పలుమార్లు జగన్ కు మద్దతుగా చిరంజీవి మాట్లాడారు. 

click me!