మంచి చేశారని ప్రజలు చెబితే గొప్ప సెల్ఫీ: చంద్రబాబు కు జగన్ కౌంటర్

Published : Apr 12, 2023, 01:03 PM ISTUpdated : Apr 12, 2023, 01:07 PM IST
మంచి చేశారని ప్రజలు  చెబితే  గొప్ప సెల్ఫీ: చంద్రబాబు కు  జగన్ కౌంటర్

సారాంశం

చంద్రబాబు  విసిరిన  సెల్ఫీ ఛాలెంజ్ కు  జగన్  కౌంటర్  ఇచ్చారు.  తమ ప్రభుత్వం కట్టిన  ఇళ్ల    ముందు  సెల్ఫీ  ఛాలెంజ్  చేసే అర్హత  చంద్రబాబుకు  ఉందా అని  ఆయన  ప్రశ్నించారు. 

ఒంగోలు:తమ  ప్రభుత్వం  కట్టిన  ఇళ్ల ముందు  సెల్ఫీ దిగే  అర్హత  చంద్రబాబుకు  ఉందా అని  ఏపీ సీఎం వైఎస్ జగన్   ప్రశ్నించారు.  ప్రకాశం జిల్లా మార్కాపురం లో వైఎస్ఆర్ ఈబీసీ  నేస్తం  కార్యక్రమం కింద  నిధులను  ఏపీ సీఎం వైఎస్ జగన్  బుధవారం నాడు విడుదల  చేశారు.  ఈ సందర్భంగా  నిర్వహించిన  సభలో  ఏపీ సీఎం జగన్  ప్రసంగించారు.  

టిడ్కో  ఇళ్ల వద్ద  ఫోటో దిగి  చంద్రబాబు  సెల్ఫీ చాలెంజ్  చేసిన  విషయమై  సీఎం జగన్ స్పందించారు.టిడ్కో ఇళ్ల వద్దకు  వెళ్లి  చంద్రబాబు ఫేక్  ఫోటోలు దిగాడన్నారు.  సెల్ఫీ  ఛాలెంజ్  అంటే నాలుగు  ఫేక్  ఫోటోలు దిగడం  కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని  చంద్రబాబును  కోరారు.

సెల్ఫీ  ఛాలెంజ్  అంటే  ప్రతీ ఇంటికి  వెళ్లి  ఏం చేశారో  చెప్పాలని  చంద్రబాబును  కోరారు. మంచి  చేసినట్టుగా  ప్రజలు  చెబితే  అప్పుడు  సెల్ఫీ తీసుకోవాలని  చంద్రబాబుకు  జగన్ సూచించారు. ప్రజలు  గొప్ప చేశారని  చెబితే  అది గొప్ప సెల్ఫీ అని  సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

 ఒక  అబ్దదం  వందసార్లు  నిజమని  చెప్పి  ప్రజలను చంద్రబాబు నమ్మిస్తున్నారని  జగన్  మండిపడ్డారు.  పంట రుణమాఫీ చేస్తామని  ఇచ్చిన హామీని  చంద్రబాబు అమలు  చేశాడా అని  జగన్  ప్రశ్నించారు. సున్నా వడ్డీ  పథకాన్ని  చంద్రబాబు  ఎగ్గొట్టారన్నారు. 

ప్రభుత్వ స్కూల్ గురించి  చంద్రబాబు  ఏనాడైనా  ఆలోచించారా  అని  ఆయన ప్రశ్నించారు.  ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్  బోధన  చంద్రబాబు  ఆలోచించారా అని  జగన్  ప్రశ్నించారు.  

ఇన్ని మంచి పనులు  చేస్తున్న  జగన్ తో  కాకుండా  నీతో  ఎలా సెల్ఫీ దిగుతామని  చంద్రబాును నిలదీయాలని  జగన్   ప్రజలను  కోరారు.  చంద్రబాబుకు  సీఎం పదవి  అంటే  దోచుకోవడం  పంచుకోవడమేనన్నారు. జగన్ కు  సీఎం పదవి  ఇవ్వడమంటే  రాష్ట్రంలోని  ప్రతి ఇంట్లో  అభివృద్ది  అనే  విషయాన్ని  చంద్రబాబుకు  చెప్పాలన్నారు. చంద్రబాబు పాలనకు , తమ  ప్రభుత్వ పాలనలో  జరిగిన  మంచి ఎంత అనే విషయాన్ని బేరీజు  వేసుకోవాలని  ఆయన  ప్రజలను కోరారు.  

గతంలో  ఓ ముసలాయన  సీఎంగా  ఉండేవాడని  చంద్రబాబుపై  జగన్  సెటైర్లు వేశారు.  చంద్రబాబు  సీఎంగా  ఉన్న సమయంలో  ఇలాంటి  పథకాలు  ఉన్నాయా  అని  ఏపీ సీఎం  జగన్  ప్రశ్నించారు.  చంద్రబాబు  సర్కార్ లో దోచుకో, పంచుకో తినుకో  అనేది  చంద్రబాబు  విధానమని  ఆయన  విమర్శించారు. ముసలాయన  పాలనలో  ఒక్క   రూపాయి  మీ  ఖాతాలో  వేశారా  అని ఆయన  విమర్శించారు. ఎలాంటి వివక్ష, అవినీతి  లేకుండా  తమ  ప్రభుత్వం  అర్హులకు  పథకాలు అందిస్తుందని సీఎం జగన్  చెప్పారు. 

ఈ  రెండేళ్లలో  వైఎస్ఆర్  ఈబీసీ  నేస్తం  ద్వారా  రూ. 1258 కోట్లు  జమ  చేసినట్టుగా  సీఎం  జగన్  చెప్పారు. రాష్ట్రంలోని  మహిళలకు  భరోసా  ఇచ్చేందుకు  తమ ప్రభుత్వం  అనేక  కార్యక్రమాలు  చేపట్టినట్టుగా  సీఎం జగన్  తెలిపారు.ఎన్ని కష్టాలున్నా  కూడా  చిరువవ్వుతో  కుటుంబాన్ని  నడిపిస్తున్న  గొప్ప వ్యక్తులు  మహిళలు అని  సీఎం జగన్  చెప్పారు. తమది  మహిళల  పక్షపాత  ప్రభుత్వమన్నారు. 

ఈబీసీ  నేస్తం ,కాపు నేస్తం  వంటి పథకాలు  ఎన్నికల మేనిఫెస్టోలో  పెట్టలేదని  ఏపీ సీఎం జగన్ గుర్తు చేశారు.  కానీ  మహిళలు  ఆర్ధికంగా  నిలదొక్కుకొనేందుకు   వైఎస్ఆర్ ఈబీసీ  నేస్తం  పథకం  అమల్లోకి తీసుకువచ్చినట్టుగా  ఆయన  వివరించారు.  

పేదరికానికి  కులం, మతం ఉండదని  సీఎం జగన్  చెప్పారు. అందుకే  తమ  ప్రభుత్వం  46 నెలల్లో  రెండు లక్షల ఏడువేల  కోట్లు నేరుగా  పేదల బ్యాంకు  ఖాతాల్లో  జమ చేసినట్టుగా వివరించారు. అంతేకాదు మహిళల  బ్యాంకు ఖాతాల్లో  లక్షా  43వేల  కోట్లను జమ చేసినట్టుగా ఆయన  గుర్తు  చేశారు.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Gudivada Amarnath Pressmeet: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్‌ పంచ్ లు| Asianet News Telugu