
అల్లూరి సీతారామరాజు జిల్లా : చేప ఓ మహిళను ముప్పుతిప్పలు పెట్టింది. నోటితో కొరికి చంపుదామని నోట్లో వేసుకోగానే.. గొంతులోకి జారి ప్రాణం తీసినంత పని చేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ గిరిజన మహిళ తోటి మహిళలతో కలిసి చేపలు పట్టేందుకు చెరువుకు వెళ్ళింది. సదరు మహిళకు ఓ చేప చిక్కింది. దాన్ని నోటితో కొరికి చంపుదామని నోట్లో పెట్టుకోగానే.. జర్రున జారి గొంతులోకి పోయింది.
అది అక్కడి నుంచి లోపలికి వెళ్ళక.. బయటికి రాక.. తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. చేప బతికే ఉండడంతో సమస్య మరింత పెరిగింది. ఆ మహిళ నోట్లో నుంచి చేపను తీయడానికి తోటి మహిళలు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. దీంతో వారు వెంటనే ఆమెని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే.. కుంజవారిగూడెం గ్రామానికి చెందిన నివసిస్తున్న కుంజా సీత అనే మహిళ రాజుపేట కాలనీలో కుటుంబంతో సహా కలిసి ఉంటుంది.
మార్కాపురంలో సీఎం జగన్ పర్యటన.. బాలినేనికి చేదు అనుభవం.. అడ్డుకున్న పోలీసులు..
ఆదివాసీలకు, తండాల్లో నివసించే గిరిజన జనాలకు తమ చుట్టుపక్కల ఉన్న చెరువులు, కాలువలు, మడుగులు, కుంటల వద్దకు వెళ్లి చేపలు పట్టడం అలవాటే. అలా పట్టుకున్న చేపలను అక్కడే చంపి.. వండుకుని తింటుంటారు. ఈ క్రమంలో భాగంగానే ఆరోజు కూడా సూర్యుడు నడినెత్తికి వచ్చే వేళ తోటి గిరిజన మహిళలతో కలిసి సీత చేపలు పట్టేందుకు వెళ్లింది. సీత వేసిన గాలానికి ఓ చిన్న చేప పడింది. ఆ చేప అటూ, ఇటూ గెంతుతుండడంతో... దాన్ని చంపాలన్న ఉద్దేశంతో.. నోటితో కొరుకుదామని నోట్లో వేసుకుంది. అంతే సర్రున గొంతులోకి జారిపోయింది.
అది గమనించిన తోటి మహిళలు చేపను బయటికి తీయడానికి ఎంత ప్రయత్నించినా చేప చిన్నగా ఉండడంతో కుదరలేదు.
ఊపిరాడక సీత కిందా మీదా చేస్తుండడంతో తోటి మహిళలు భయపడిపోయారు. ఆమె ప్రాణం పోతుందేమో అని భయపడ్డారు. వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అతి కష్టం మీద గొంతులో ఇరుక్కున్న చేపను బయటకు తీశారు. దీంతో ఆమె ప్రాణాలు నిలబడ్డాయి. చాలాసేపటి వరకు సరిగా శ్వాస ఆడకపోవడంతో సీత ముఖమంతా ఉబ్బిపోయింది. ప్రస్తుతం ఆమెకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.