కరోనా బాధిత కుటుంబాలకు అండగా... వెంటనే కారుణ్య నియామకాలు: కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు

Arun Kumar P   | Asianet News
Published : Feb 02, 2022, 03:42 PM ISTUpdated : Feb 02, 2022, 03:47 PM IST
కరోనా బాధిత కుటుంబాలకు అండగా... వెంటనే కారుణ్య నియామకాలు: కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు

సారాంశం

విధుల్లో వుండగా కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన ప్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాల్లో అన్ని అర్హతలు కలిగినవారికి వెంటనే కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.    

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కోవిడ్‌ కారణంగా మరణించిన ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగుల (frontline employees) కుటుంబాల్లో అన్ని అర్హతలు కలిగినవారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన కరోనా బాధిత కుటుంబాల వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలివ్వాలని సీఎం సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను కారుణ్య నియామకాల కోసం వినియోగించుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. 

ఇతర విభాగాల్లో ఉద్యోగాలంటే ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి... కాబట్టి అలాంటి సమస్యలు లేకుండా యుద్ద ప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలివ్వాలని సీఎం సూచించారు. జూన్‌ 30లోగా కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. అన్ని విభాగాలూ దీనిపై దృష్టిపెట్టాలి జగన్ కోరారు.

ముందుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీ పోస్టులను ప్రాధాన్యతగా తీసుకుని కారుణ్య నియామకాలు చేయాలని... ఇందులో ఆలస్యానికి తావు ఉండకూడదని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు. 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. జూన్‌ 30నాటికి ఆ ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. వారికి జులై 1నాటికి కొత్త జీతాలు అందజేయాలని తెలిపారు. మిగిలిన 25శాతం ఉద్యోగులు ప్రొబేషన్‌ పరీక్షలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మార్చి మొదటి వారంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు సీఎంకు తెలిపారు. వారికి అవసరమైన శిక్షణ, సబ్జెక్టుపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు చెప్తున్నామన్నారు. ఉద్యోగుల సర్వీసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని... మంచి చేయాలనే ఉద్దేశ్యంతోనే  సర్వీసును పెంచామన్నారు. దీనికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు.

ఇక జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్స్‌లో 10శాతం స్థలాలను 20 శాతం రిబేటుపై కేటాయించమని అన్నారు. ఎంఐజీ లేఅవుట్స్‌లో వీరికి స్థలాలు ఇవ్వాలని... వారికి స్థలాలు కేటాయించేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయాలని... దీనివల్ల డిమాండ్‌ తెలుస్తుందన్నారు. మార్చి 5లోగా స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయాలని సీఎం ఆదేశించారు.

ఉద్యోగులే కాకుండా స్థలాలు కోరుతున్న ఇతరుల పేర్లను కూడా వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. దీంతో డిమాండ్‌ను బట్టి వెంటనే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. స్థల సేకరణకు వీలు ఉంటుందన్నారు. సేకరించిన స్థలంలో 5శాతం స్థలాలను పెన్షనర్లకు రిజర్వ్‌ చేయాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. 

ఈ కారుణ్య నియామకాలకు సంబంధించి ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాతో మృతిచెందిన ఉద్యోగి నిర్వహించిన పోస్టుకు సమానమైన ఉద్యోగం లేదా అంతకంటే తక్కువస్థాయి హోదాతో అర్హులైన వారి కుటుంబసభ్యుల నియామకం వెంటనే జరపాలంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా  ఈ నియామకాలను 2021 నవంబరు 31లోగా చేపట్టాలని నిర్ణయించినా పెద్ద మొత్తంలో దరఖాస్తులు రావడంతో నిర్ణీత సమయంలో నియామక ప్రక్రియ పూర్తిచేయడం సాధ్యం కాలేదని ప్రభుత్వం తెలిపింది. 

సాధ్యమైనంత తొందరగా కారుణ్య నియామకాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీలను మృతిచెందిన ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులతో భర్తీ చేయాలని నిర్ణయించింది. త్వరితగతిన దరఖాస్తులను పరిష్కరించి అర్హులైన అభ్యర్ధులతో తక్షణమే గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసారు. 
 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu