పేదరికం దాటి ముందుకు అడుగేయాలి: సీఎం జగన్ పిలుపు

By Siva KodatiFirst Published Feb 24, 2020, 3:29 PM IST
Highlights

దేవుడి దయ చాలా కావాలి... ఎందుకంటే రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నామని సీఎం వ్యాఖ్యానించారు. ఏ తప్పూ చేయకపోయినా కూడా, ఏదేదో జరిగి పోతున్నట్లుగా టీవీ ఛానళ్లు విపరీతమైన రాతలు రాస్తున్నాయని జగన్ ఆరోపించారు. 

దేవుడి దయ చాలా కావాలి... ఎందుకంటే రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నామని సీఎం వ్యాఖ్యానించారు. ఏ తప్పూ చేయకపోయినా కూడా, ఏదేదో జరిగి పోతున్నట్లుగా టీవీ ఛానళ్లు విపరీతమైన రాతలు రాస్తున్నాయని జగన్ ఆరోపించారు. యుద్దం చేస్తోంది ఒక్క ప్రతిపక్షంతోనే కాదని... ఒక ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా పేద కుటుంబంలో ఉన్న వారు పేదరికం దాటి ముందుకు అడుగు వేయలేదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సోమవారం విజయనగరంలో జగనన్న వసతి దీవెన పథకాన్ని సీఎం ప్రారంభించారు.

అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. పేద కుటుంబం అప్పుల పాలు కాకుండా, ఆ కుటుంబం నుంచి ఒక ఇంజనీరు, డాక్టర్‌ లేదా కలెక్టర్‌ అయినా కావాలన్నారు. పెద్ద పెద్ద చదువులు చదివి, పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందాలని వారు సంపాదించిన దానిలో కొంత ఇంటికి పంపాలని.. అప్పుడే పేదరికం పోతుందని సీఎం ఆకాంక్షించారు.

Also Read:ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నా: మీడియాపై దుమ్మెత్తిపోసిన జగన్

రాష్ట్రంలో ఇప్పటికీ 33 శాతం నిరక్షరాస్యులున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇది 27 శాతం మాత్రమేనని, అంటే జాతీయస్థాయి కంటే దిగువన మనం ఉన్నామన్నారు. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) కూడా కేవలం 23 శాతమే ఉందని జగన్ అన్నారు.

ఈ పరిస్థితి మారడం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామని సీఎం స్పష్టం చేశారు. అందులో భాగంగా ఇవాళ ఇక్కడి నుంచి వసతి దీవెన ప్రారంభిస్తున్నందుకు గర్వపడుతున్నానన్నారు.

ఏటా రూ.2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న పేద విద్యార్థులకు రూ.20 వేల వరకు హాస్టల్, మెస్‌ ఛార్జీల కింద ఇస్తామని జగన్ తెలిపారు. జనవరి, ఫిబ్రవరిలో మొదటి వాయిదా కింద రూ.10 వేలు, జూలై, ఆగస్టులో మరో రూ.10 వేలు డిగ్రీ, ఆ పై కోర్సులు అభ్యసించే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని జగన్ వెల్లడించారు.

వీరే కాకుండా ఐటిఐ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు కూడా రెండు విడతల్లో రూ.15 వేలు ఇస్తామన్నారు. ఒక కుటుంబంలో ఎందరు పిల్లలు చదివినా అందరికీ ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Also Read:చంద్రబాబుకు మరో చిక్కు: సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

దాదాపు 11.87 లక్షల మంది పిల్లలకు ఒక బటన్‌ నొక్కగానే, ఆయా మొత్తాల్లో సగం ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా దాదాపు రూ.1100 కోట్లు జమ అవుతాయన్నారు. వసతి దీవెన కోసం ఏటా రూ.2300 కోట్లు ఖర్చు చేస్తుండగా, విద్యా దీవెన కోసం ఏటా మరో రూ.3700 ఖర్చు చేయబోతున్నామన్నారు.

ఇవే కాకుండా అమ్మ ఒడి పథకంలో అక్షరాలా 42 లక్షల మంది తల్లులకు, తద్వారా 82 లక్షల మంది పిల్లలకు మేలు కలుగుతుందని సీఎం పేర్కొన్నారు. ఆ తల్లుల ఖాతాల్లోకి రూ.15 వేల చొప్పున, రూ.6400 కోట్లు జమ చేశామని, ఈ మూడు పథకాలకే రూ.12400 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.

నాడు–నేడు మనబడి ద్వారా మూడేళ్లలో అన్ని స్కూళ్ల రూపురేఖలు మార్చబోతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంపై రోజూ కొందరు విమర్శలు చేస్తున్నారు. వారిని ఏమనాలో మీరే ఆలోచించాలన్నారు. 

click me!