చంద్రబాబుకు మరో చిక్కు: సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

By telugu teamFirst Published Feb 24, 2020, 1:46 PM IST
Highlights

ఏపీ రాజధానిపై నిర్ణయం తీసుకునే విషయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిబంధనలను, కమిటీ నివేదికలను తుంగలో తొక్కి సొంత నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి మెడకు మరోకేసు చుట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో చంద్రబాబు నిబంధనలను, ఆదేశాలను, చట్టాలను పక్కన పెట్టి తప్పుడు నిర్ణయం తీసుకున్నారని, అమరావతిని రాజధానిగా నియమించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

ఆంధ్రప్రదేస్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అనిల్ కుమార్ బోరుగడ్డ సోమవారం ఆ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎపీ రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో చంద్రబాబు నిబంధనలు పాటించలేదని, నిబంధనలను ఉల్లంఘించి రాజధాని ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకున్నారని ఆయన పిటిషన్ లో ఆరోపించారు 

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను, రాజధాని ఏర్పాటు నియమించిన శిమరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. స్వార్థం కోసం చంద్రబాబు రాజధానిని విజయ, గుంటూరుకు తరలించారని ఆయన అన్నారు. 

అనిల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరఫున వాదనలను సుప్రీంకోర్టు విన్నది. దీనిపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్, బినామీ లావాదేవీలు తదితర అక్రమాలపై సిట్ విచారించి, చార్జిషీట్ దాఖలు చేయనుంది. 

click me!