
ఏపీ సీఎం, వైసీపీ (ysrcp) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) 2024 ఎన్నికలపై (2024 ap election) దృష్టి పెట్టారు. బుధవారం తాడేపల్లిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీలో వివిధ స్థాయిల్లో ఉన్న కీలక నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు ఈ భేటీలో కీలకంగా వ్యవహరించనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది అప్పుడే మూడేళ్లు దాటిపోతోంది. మరో రెండేళ్లలో ఎన్నికలకు సిద్ధం కావాల్సి వుంది. ఈ క్రమంలో ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ ఈ భేటీలో దిశా నిర్దేశం చేయనున్నారు. అనుభవం ఉన్న పార్టీ నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్న ఆయన ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
మరోవైపు.. మంగళవారం వైఎస్సార్‌సీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీమ్ సేవల్ని పార్టీకి వినియోగించుకోవడం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్లో పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చని.. తమకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండదని.. ఒంటరిగానే పోటీచేయాలన్నది జగన్ సిద్ధాంతమని సజ్జల స్పష్టం చేశారు.
తమతో పొత్తు పెట్టుకోవాలని చాలా పార్టీలు అనుకోవచ్చన్నారు. కానీ సీఎం జగన్ ఎప్పుడూ పొత్తుల్లేకుండానే రాజకీయం చేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. గత ఎన్నికల తర్వాత పీకే, ఐపాక్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ముగిసిందని.. వచ్చే ఎన్నికలకు థర్డ్ పార్టీ ద్వారా సర్వే చేయిస్తామని రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. సజ్జల చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో జగన్ కీలక భేటీ నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా.. ప్రశాంత్ కిషోర్.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో పీకే టీమ్ కీలక పాత్ర పోషించింది. అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో పార్టీల కోసం పనిచేశారు. అయితే.. ప్రశాంత్ కిషోర్ .. తాజాగా కాంగ్రెస్ తో కలిసి అడుగులు వేయబోతున్నారు. దీంతో రాబోయే ఎన్నికలకు ఆయన ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీతో పొత్తు ఉంటుందనే ప్రచారం ప్రారంభమైంది. అలాగే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో డీఎంకేతో (dmk), పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (trinamool congress) , మహారాష్ట్రలో ఎన్సీపీతో (ncp) , జార్ఖండ్‌లో జేఎంఎంతో (jmm) కలిసి వెళ్లాలని చెప్పారట. తెలంగాణలో విడిగా పోటీ చేయాలని ప్రతిపాదించినట్లు టాక్ వినిపిస్తోంది.