
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బుద్దా వెంకన్న నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అధికారం పోతుందని భయపడుతున్నారని ఆరోపించారు.
సీఎం జగన్‌ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని అన్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వకుంటే అప్రూవరుగా మారతానని విజయసాయి రెడ్డి జగన్‌కు స్పష్టం చేశారని చెప్పుకొచ్చారు. విజయసాయి రెడ్డికి సీఎం జగన్ పక్కన పెట్టారని తాము అనడం లేదని, వైసీపీ నేతలే అంటున్నారన్నారు. విజయసాయిరెడ్డికి ఉన్నట్టుండి కీలక బాధ్యతలు అప్పగించడానికి బ్లాక్‌మెయిల్ చేయడమే కారణమని అన్నారు.
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారం జరిగితే.. బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. నోటీసులిస్తే జగన్ వద్ద మార్కులు పడతాయని వాసిరెడ్డి పద్మ భావిస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు ఇచ్చిన నోటీసు చెత్త కాగితంతో సమానమన్నారు.