ఇంగ్లీష్ మీడియం చదువులు మీ పిల్లలకే నా ? పేద పిల్లలకు వద్దా..!: సీఎం జగన్

By Nagaraju penumala  |  First Published Nov 14, 2019, 12:41 PM IST

సినీనటులు, రాజకీయ నాయకులు, భారత ఉపరాష్ట్రపతి లాంటివంటి వారు సైతం తనపై విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మనవళ్లు, మీ కుటుంబ సభ్యులు పిల్లలు మాత్రమే ఇంగ్లీషు మీడియం చదువుకోవాలా నిరుపేదల పిల్లలు చదువుకోవద్దా అని నిలదీశారు. నిజాయితీగా ఆలోచించి వాస్తవాలు గమనించాలన్నారు. 


ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై విమర్శలు చేస్తున్న వారిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దోళ్ల పిల్లలే ఇంగ్లీషు మీడియం చదవాలా...పేదోళ్ల పిల్లలు చదవకూడదా అంటూ మండిపడ్డారు. ఒంగోలులో నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ పేద విద్యార్థి బతుకు బాగుపడాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.  

రాబోయే రోజుల్లో ప్రతీపేద విద్యార్థి భవిష్యత్ బాగుపడాలనే ఉద్దేశంతో ఇంగ్లీషు మీడియంను తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పటికే సాంకేతకంగా దేశం ఎంతో ముందుకు వెళ్తోందన్నారు. ల్యాండ్ ఫోన్స్ నుంచి స్మార్ట్ ఫోన్ స్థాయికి ఎదిగామన్నారు. ఇంటర్నెట్ నుంచి యాప్ వరకు వెళ్లిపోయామని భవిష్యత్ లో కార్లకు డ్రైవర్ లేకుండా కూడా వెళ్లిపోయే పరిస్థితి కూడా లేకపోలేదన్నారు.  

Latest Videos

మరో పది సంవత్సరాల తర్వాత ఇంగ్లీషు చదువులు లేకపోతే వాళ్ల భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది అన్న అంశంపై ఆలోచించే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచన చేయాల్సిందిగా జగన్ సూచించారు. 

పేద వర్గాల పిల్లలు నేటికి చదువుకు దూరమైన పరిస్థితి నెలకొందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 33 శాతం నిరుపేదల పిల్లలకు చదువు అందడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మంచి భవిష్యత్ అందించాలన్నదే తమ లక్ష్యమని జగన్ చెప్పుకొచ్చారు.

మరోపదేళ్లు ఇలానే ఉండాలా లేక ప్రపంచంతో పోటీపడేలా సిద్ధం చేయాలా అనేది ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చిన్నారులకు బంగారు భవిష్యత్ ఇచ్చి అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దాలా లేకపోతే వీరి తలరాతలు ఇలానే ఉండాలి అని వెనక్కి తగ్గాలా అంటూ జగన్ నిలదీశారు.  

పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలను చదువుల దేవాలయంగా మార్చాలా లేక వారి తలరాతలు అలానే ఉన్నాయని చెప్పి వదిలేసి కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ముకాయాలా అంటూ ప్రశ్నించారు. ఈ తరం పిల్లలు ఎక్కడైనా బతికేందుకు, పోటీలో నిలిచేందుకు అవసరమైన విద్యను అందించాలా అన్నది ప్రభుత్వం ముందు ఉన్న సవాల్ అని అందులో భాగంగానే ఇంగ్లీషు మీడియంను తెరపైకి తెచ్చామన్నారు. 

రాజకీయ నాయకుడు, సినీనటుడు, జర్నలిస్ట్, అధికారులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదవించడం లేదని వారిలాగే ప్రభుత్వ పాఠశాలలను వదిలేయాలా అంటూ నిలదీశారు. ఇప్పటికైనా విద్యావ్యవస్థను మార్చాలన్నదే తమ తపన అన్నారు. 

పేదవాడు తెలుగే చదవాలని, ఇదే సంస్కృతి అని చెప్తే భవిష్యత్ లో పోటీ ప్రపంచంలో వారిని చూసి వెటకారంగా మాట్లాడే పరిస్థితి నెలకొంటుందన్నారు. పోటీ ప్రపంచంలో పోటీపడలేక వెనకడుగు వేస్తే ఆ తర్వాత బాధపడాల్సి వస్తోందన్నారు. 

విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టి భావితరాలకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. ప్రపంచ జాబ్ మార్కెట్ తో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలా అనే అంశంపై చర్చించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. 

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ప్రపంచంతో పోటీ పడలేక, ప్రైవేట్ స్కూల్లో చదివే స్తోమత లేక పేదపిల్లలు కూలీలుగా మారే ప్రమాదం ఉందన్నారు. కనీసం డ్రైవర్లుగా కూడా పనిచేసే అవకాశం లేదని తెలిపారు. ఎందుకంటే డ్రైవర్లు లేని కార్లు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. 

విద్యావ్యవస్థలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకురావాలని విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలన్నదే తమ లక్ష్యమన్నారు. తాను విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంటే తనను టార్గెట్ చేస్తూ కొందరు రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

సినీనటులు, రాజకీయ నాయకులు, భారత ఉపరాష్ట్రపతి లాంటివంటి వారు సైతం తనపై విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మనవళ్లు, మీ కుటుంబ సభ్యులు పిల్లలు మాత్రమే ఇంగ్లీషు మీడియం చదువుకోవాలా నిరుపేదల పిల్లలు చదువుకోవద్దా అని నిలదీశారు. నిజాయితీగా ఆలోచించి వాస్తవాలు గమనించాలన్నారు. 

దొంగలు సైతం ఎత్తుకోపోలేని ఆస్తి, చదువు ఒక్కటే నిజమైన సంపద అంటూ సీఎం జగన్ అభివర్ణించారు. విద్యార్థులు బాగా చదువుకుంటే కలెక్టర్లుగానూ, ఇంజనీర్లుగానూ ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.  

చరిత్రను మార్చబోయే నాడు-నేడు అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జగన్ అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో నేను చూశాను, నేను విన్నాను..నేను ఉన్నాను అని చెప్పానని అక్షరాలా నేను ఉన్నాను అంటూ రుజువు చేస్తూ అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. 

నాడు- నేడు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45వేల ప్రభుత్వ పాఠశాలల్లో 15,715 పాఠశాలల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 

నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పిస్తామన్నారు. మరుగుదొడ్లు, కరెంట్, ఫ్యాన్, రంగులు, ఇంగ్లీషు ల్యాబ్ లు వంటి మెుత్తం తొమ్మిది రకాల మౌళిక వసతులు కల్పించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. 

ప్రతీ స్కూల్లో ఇంగ్లీషు మీడియం అమలు చేస్తున్నామని కంపల్సరీ సబ్జెక్టుగా తెలుగు ఉంటుందన్నారు. ఇంగ్లీషు మీడియం చదవడానికి విద్యార్థి మెుదట్లో కాస్త ఇబ్బందులు పడతారని వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఒక్కటో తరగతి నుంచి ఆరోతరగతి వరకు ఇంగ్లీషు మీడియం ఉంటుందన్నారు. విద్యార్థులకు బోధించేందుకు టీచర్లకు ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. విద్యార్థులు ఇంగ్లీషు నేర్చుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

అలాగే సిలబస్ కూడా మార్చుబోతున్నట్లు తెలిపారు. ఇంగ్లీషు మీడియం వల్ల తొలుత అనేక ఇబ్బందులు ఎదురవ్వడం సహజమేనన్నారు సీఎం జగన్. ఛాలెంజెస్ ఉన్నప్పుడే అధిగమించాలి అని సూచించారు. 

ఒక సంవత్సరం ఇబ్బంది పడతామని రెండో సంవత్సరం సన్నద్ధమవుతామని మూడో సంవత్సరం గాడినపడతామని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పదేళ్లలో ప్రపంచంతో పోటీ పడొచ్చని తెలిపారు. 

ఛాలెంజెస్ ఎదురువుతాయని పేదపిల్లలను వదిలేస్తే వారి తలరాతలు, బతుకులు మారవన్నారు. పిల్లల భవిష్యత్ మారాలి అంటే ఇంగ్లీషు మీడియం చదవాల్సిందేనని తెలిపారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తాను పట్టించుకోనని పేదవర్గాల పిల్లలు అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.  

దేవుడు ఆశీస్సులు, ప్రజల అండదండలతో ముందుకు వెళ్తానని జగన్ తెలిపారు. గత ప్రభుత్వం పాఠశాలల మరమ్మత్తులకు రూ.20కోట్ల రూపాయలు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం ఏడాదికి రూ.3,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వం రూపు రేఖలు మార్చేందుకు రాబోయే మూడేళ్లలో రూ.12వేల కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు జగన్ స్పష్టం చేశారు.

రాష్ట్రప్రభుత్వం పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ దేవుడు ఆశీస్సులు, ప్రజల అండదండలతో ముందుకు వెళ్తానన్నారు. మంచి మనసుతో ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతం అవుతుందని సీఎం జగన్ తెలిపారు.  

జనవరి 9న అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రతీ తల్లి తమ పిల్లలను బడికి పంపితే వారి అకౌంట్లలో ఏడాదికి రూ.15వేలు అందించనున్నట్లు తెలిపారు సీఎం జగన్. ఆ తల్లి చేయాల్సిందల్లా పిల్లలను బడికి పంపించడమేనన్నారు. బడులలో ఇంగ్లీషు మీడియం తీసుకువస్తున్నాం, పిల్లల భవిష్యత్ మార్చబోతున్నామంటూ సీఎం జగన్ తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం: అమలుకు స్పెషల్ ఆఫీసర్

Pawan: జగన్మోహన్ రెడ్డి మట్టిలో కలిసిపోతారు: పవన్ కల్యాణ్ శాపనార్థాలు
 

click me!