జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్)పై దుష్ప్రచారంపై కఠినంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఓటీఎస్ పథకం ద్వారా లక్షలమంది పేదలకు లబ్ధి జరుగుతుందని, చట్టపరంగా హక్కులు దఖలుపడతాయని జగన్ అన్నారు. ఇంతలా మేలు చేస్తున్న ఈ పథకంపట్ల ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్)పై దుష్ప్రచారంపై కఠినంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎంవో అధికారులతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటీఎస్ పథకం ద్వారా లక్షలమంది పేదలకు లబ్ధి జరుగుతుందని, చట్టపరంగా హక్కులు దఖలుపడతాయని జగన్ అన్నారు. ఇంతలా మేలు చేస్తున్న ఈ పథకంపట్ల ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల్లో సందేహాలు ఉంటే అధికారులు ఒకటికి రెండుసార్లు అవగాహన కల్పించాలని జగన్ సూచించారు. పథకం ద్వారా వచ్చే లబ్ధిని, రిజిస్టర్ పత్రాల ద్వారా వారికి మాఫీ అవుతున్న అసలు, వడ్డీ వివరాలనుకూడా చూపించాలని సీఎం ఆదేశించారు.
అంతకుముందు పేదలకు ప్రయోజనం కలిగించేందుకే వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీం ప్రవేశపెట్టామన్నారు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. (botsa satya narayana) బుధవారం అమరావతిలో మీడియాలో మాట్లాడిన ఆయన.. లబ్ధిదారులకు గృహహక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇది బలవంతపు పథకం కాదని.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే పథకం వర్తింపజేస్తామని బొత్స తెలిపారు. పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ ఈ పథకం చేపట్టారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వివాదాస్పద ఆదేశం ఇచ్చిన అధికారిని సస్పెండ్ చేశామని ఆయన పేర్కొన్నారు. పథకం ప్రకారం ప్రభుత్వంపై టీడీపీ కుట్ర చేస్తోందని బొత్స సత్యనారాయణ ఆరోపపించారు. అధికారులు ఎవరూ ప్రజలను బలవంతం చేయరని.. పేదలపై టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బొత్స మండిపడ్డారు.
కాగా.. వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా ఇంటిపై సర్వహక్కులు పొందవచ్చంటూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరిట భారీ దోపీడీకి జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. వన్ టైమ్ సెటిల్ మెంట్ తప్పనిసరి కాదంటూనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని లబ్దిదారులు వాపోతున్నారని లోకేష్ పేర్కొన్నారు. ''జగన్ రెడ్డి జలగలా ప్రజల రక్తాన్ని పీలుస్తున్నాడు. ఎన్టీఆర్ గారి హయాం నుండి వివిధ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన పక్కా ఇళ్లకు రిజిస్ట్రేషనంటూ రూ.1500 కోట్లు కొట్టేసే స్కెచ్ వేసారు. ఎవరూ ఒక్క రూపాయి కూడా కట్టొద్దు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తాం'' అని nara lokesh హామీ ఇచ్చారు.