ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
విజయవాడ: కనకదుర్గ అమ్మవారికి ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు పట్టువస్త్రాలు సమర్పించారు.ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సాయంత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయానికి చేరుకున్నారు. సీఎం జగన్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఆలయ చిన్న రాజగోపురం వద్ద సీఎం జగన్ కు పరివేష్టం చుట్టారు అర్చకులు.
మూలానక్షత్రం రోజున అమ్మవారు బాలత్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కనకదుర్గ అమ్మవారికి సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా ఐదో ఏడాది సీఎం జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం జగన్ కు తీర్థప్రసాదాలు అందించారు అర్చకులు. సీఎం ను వేద పండితులు ఆశీర్వదించారు.కనకదుర్గ ఆలయ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. దీంతో వచ్చే నెలలో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.