నేడు ఢిల్లీకి సీఎం జగన్.. మోదీ, షాలతో సమావేశాలు.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఉత్కంఠ..!!

Published : Jul 05, 2023, 09:36 AM IST
నేడు ఢిల్లీకి సీఎం జగన్.. మోదీ, షాలతో  సమావేశాలు.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఉత్కంఠ..!!

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సీఎం జగన్ ఢిల్లీలోని జనపథ్‌-1లోని నివాసానికి చేరుకోనున్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.  రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలతో పాటు పలు అంశాలపై సీఎం జగన్ వారితో చర్చించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

సీఎం జగన్ తొలుత మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ప్రధాని మోదీని కలవనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటల సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. ఈ రోజు రాత్రికి సీఎం జగన్ ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. తర్వాత ఢిల్లీ నుంచి తాడేపల్లికి తిరిగి రానున్నారు. 

అయితే రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో మరో ఏడాదిలోపే ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల్లో బీజేపీతో కలిసి ముందుకు సాగాలని  టీడీపీ, జనసేనలు భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత నెలలో ఢిల్లీకి వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. అయితే సమావేశానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి.. బీజేపీ పెద్దలను కలిశారు. 

ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇటీవల ఏపీలో పర్యటించిన అమిత్ షా, జేపీ నడ్డాలు.. రాష్ట్రంలోని అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు వైసీపీ అనుకూల వైఖరి కనబరుస్తారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సోము వీర్రాజును కూడా ఏపీ బీజేపీ చీఫ్‌గా తొలగించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి.. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలే కలిగి ఉంది.  అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో మోదీ, అమిత్ షాలతో రాజకీయ అంశాలు కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!