సుజనా ఇంట్లో దాడులు...మోడీ కక్ష సాధింపే: చంద్రబాబు

By sivanagaprasad kodatiFirst Published Nov 28, 2018, 12:00 PM IST
Highlights

తెలంగాణ ప్రజాకూటమి గెలవాలని ఆకాంక్షించారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇవాళ ఉదయం టీడీపీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజాకూటమి గెలుపు దేశ రాజకీయాల్లో కీలక మలుపు కావాలన్నారు.

తెలంగాణ ప్రజాకూటమి గెలవాలని ఆకాంక్షించారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇవాళ ఉదయం టీడీపీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజాకూటమి గెలుపు దేశ రాజకీయాల్లో కీలక మలుపు కావాలన్నారు.

ఏపీలో రైతులకు రూ.లక్షన్నర చొప్పున రుణమాఫీ జరిగితే... తెలంగాణలో రూ.లక్ష మాత్రమే జరిగిందన్నారు. తెలంగాణలో డ్వాక్రా మహిళలకు రూపాయి ఇవ్వలేదని.. ఏపీలో ప్రతి డ్వాక్రా మహిళకు రూ.10 వేలు లబ్ధి చేకూరిందని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 10 లక్షల మందికి ఉపాధి లభిస్తే... తెలంగాణలో అందులో సగం కూడా రాలేదన్నారు. ప్రభుత్వ చేయూతతో మన దగ్గర రైతు ఆత్మహత్యలు తగ్గాయని.. తెలంగాణలో 50 మంది రైతు బలవన్మరణానికి పాల్పడటంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నాలుగున్నరేళ్లలో అప్పుల పాలైందని.. కానీ లోటు బడ్జెట్‌లో కూడా ఏపీ అద్భుత ప్రగతి సాధించిందన్నారు. టీటీడీపీ కార్యకర్తలు మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని దిశానిర్దేశం చేశారు.

విజయనగరంలో జరిగిన ధర్మపోరాట సభ విజయవంతమైందని... మిగిలిన 3 సభలను కూడా విజయవంతం చేయాలని నేతలను ఆదేశించారు. ప్రజలకు సేవ చేయడంతో పాటు పార్టీలో చురుగ్గా ఉండాలన్నది టీడీపీ సూత్రమని సీఎం అన్నారు. పార్టీ నేతల్లో అలసత్వం సహించనన్నారు. తిరుగులేని శక్తిగా టీడీపీ రూపొందాలని.. ముస్లిం మైనారిటీల్లో సాధించిన పట్టును నిలబెట్టుకోవాలని శ్రేణులకు సూచించారు.

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇంట్లో ఈడీ దాడులపై స్పందించిన చంద్రబాబు.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే దాడులు జరిపించారని ఎద్దేవా చేశారు. రాజకీయ వేధింపులతో ప్రధాని నరేంద్రమోడీ బరితెగించారని ముఖ్యమంత్రి ఆరోపించారు. తాము ఇలాంటి దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.

click me!