
మమతా బెనర్జీ డిమాండ్ ఆచరణ సాధ్యమేనా? తొమ్మిది రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోడి వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దాంతో దేశం మొత్త అల్లకల్లోలం మొదలైంది. అదే విషయమై విపక్షాలు మండిపడుతున్నాయి. మోడి సర్కార్ పై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే గురువారం ఢిల్లీలో బహిరంగ జరిగింది.
ఈ సభలో మమత మాట్లాడుతూ రద్దు చేసిన పెద్ద నోట్లను తిరిగి చెలామణిలోకి తేవాలన్నారు. అందుకోసం మోడికి మూడు రోజులు గడువిస్తున్నట్లు కూడా సభలోనే ప్రకటించారు. చెలామణిలోకి తేకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించారు. ఇదే విషయమై సర్వత్రా చర్చ మొదలైంది. ఒకసారి రద్దు చేసిన నోట్లను తిరిగి చెలామణిలోకి తేవటమన్నది జరిగేపనేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆచరణ సాధ్యంకాని డిమాండ్ల కన్నా నగదు ఎక్స్ ఛేంజ్ పరిమితిని పెంచటం, ఏటిఎంల్లో కొత్త డిజైన్లను యుద్ధ ప్రాతిపదకపై ఏర్పాటు చేయమనటం, విత్ డ్రాల పరిమితిని పెంచటం లేదా ఎత్తేయమనే డిమాండ్లు చేయకుండా రద్దైన నోట్లను చెలామణిలోకి తెమ్మంటే జరిగే పనికాదని అనుకుంటున్నారు. మమత చేసిన డిమాండ్ విషయంలో ప్రతిపక్షాల్లో కూడా మిశ్రమ స్పందన కనబడుతోంది.