సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై ఏపీ సీఐడీ కొరడా: ఏ వయసు వాళ్లయినా శిక్షే

By Siva KodatiFirst Published May 20, 2020, 6:03 PM IST
Highlights

సోషల్ మీడియాలో అసత్యప్రచారాలపై ఏపీ సీఐడీ కొరడా ఝళిపిస్తోంది. విశాఖ ఎల్జి పాలిమర్స్ గ్యాస్ విషయంలో తప్పుడు ప్రచారం చేసిన వారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది

సోషల్ మీడియాలో అసత్యప్రచారాలపై ఏపీ సీఐడీ కొరడా ఝళిపిస్తోంది. విశాఖ ఎల్జి పాలిమర్స్ గ్యాస్ విషయంలో తప్పుడు ప్రచారం చేసిన వారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ప్రజలని రెచ్చగొట్టే విధంగా పోస్టింగ్ పెట్టిన రంగనాయకమ్మ పై కేసు నమోదు చేశారు.

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపడుతూ పెట్టిన పోస్టుకు సహకరించిన రఘునాద్ మల్లాడి పైనా సీఐడీ దృష్టి సారించింది. సున్నితమైన అంశంలో ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం పోయేలా ప్రచారం జరిగిందని సీఐడీ ఎస్పీ సరిత తెలిపారు.

హెచ్చరికలు చేస్తున్నా పోస్టింగులు పెట్టినందువల్లే రంగనాయకమ్మను అరెస్ట్ చేశామని ఆమె చెప్పారు. ఏ వయసు వారు తప్పుచేసినా శిక్ష తప్పదని సరిత హెచ్చరించారు. మొదటిసారి తప్పు చేసిన వారికి న్యాయస్థానం 3 ఏళ్ళ జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా విధిస్తుందని ఆమె వెల్లడించారు.

రెండోసారీ తప్పుచేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, పది లక్షల జరిమానా విధిస్తుందని సరిత హెచ్చరించారు. కాగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యవహరంపై గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ అనే 66 ఏళ్ల వృద్ధురాలికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు సంబంధించి తన స్నేహితుడు కొన్ని పాయింట్స్ పెట్టారని... గ్యాస్, దాని క్వాలిటీ గురించి, పరిహారం తదితర వాటి గురించి సోషల్ మీడియాలో పెట్టారని రంగనాయకమ్మ చెప్పారు. ఇది అందరూ చదివితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఆ విషయాన్ని ఆయన అనుమతితో కాపీ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినట్లు ఆమె చెప్పారు. 

click me!