ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా మీడియాతో మాట్లాడడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
అమరావతి: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు షోకాజ్ నోటీసును జారీ చేసింది. ఆలిండియా సర్వీస్ రూల్స్ కు విరుద్దంగా మీడియాతో మాట్లాడారని AB Venkateswara Raoకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Sameer Sharma షోకాజ్ నోటీసు పంపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా Chandrababu Naidu ఉన్న సమయంలో Pegasus సాప్ట్ వేర్ ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం Mamata Benarjee ఇటీవల ప్రకటించారు. ఈ విషయమై AP Assembly లో చర్చ జరిగింది. అంతేకాదు ఏపీ అసెంబ్లీ శాసనసభ కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీకి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మెన్ గా ఉంటారు.
ఏపీ అసెంబ్లీలో పెగాసెస్ అంశంపై చర్చ జరిగి House Committee ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న రోజునే హైద్రాబాద్ లో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. .పెగాసెస్ సాప్ట్ వేర్ ను 2019 మే వరకు ఉపయోగించలేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న తనకు ఈ విషయాలు తెలుసునన్నారు. పెగాసెస్ సహా ఇతర ఎలాంటి సాఫ్ట్ వేర్ లు ఉపయోగించలేదన్నారు.
అయితే ఆలిండియా సర్వీసు నిబంధనలకు విరుద్దంగా ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారని అదే రోజున వైసీపీ ప్రజా ప్రతినిధులు విమర్శలు చేశారు. ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఏబీ వెంకటేశ్వరరావుకు లేఖ రాశారు. మీడియాతో మాట్లాడిన విషయమై వివరణ ఇవ్వాలని ఆ లేఖలో ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకొంటామని ఆ లేఖలో Chief Secrettaryహెచ్చరించారు.
ఇదిలా ఉంటే ఇటీవలనే తనపై విధించిన Suspension కూడా పూర్తైందని కూడా ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. సస్పెన్షన్ పూర్తైనందున తనకు పూర్తి వేతనం ఇవ్వాలని కోరారు. మరో వైపు తన ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్న వారిపై కేసు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ ప్రభుత్వం అనుమతిని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఇజ్రాయిల్ నుండి నిఘా పరికరాలు కొనుగోలు చేశారని ఈ కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగా ఆయనపై సస్పెన్షన్ వేటేశారు. ప్రతి ఆరు మాసాలకు ఓసారి ఈ సస్పెన్షన్ ను పొడిగిస్తున్నారు. అయితే ఈ ఏడాది జనవరి తర్వాత తన సస్పెన్షన్ ను పొడిగించలేదని ఏబీ వెంకటేశ్వరరావు చెబుతున్నారు. రెండేళ్ల కంటే ఎక్కువ సమయం సస్పెన్షన్ విధించాలంటే కేంద్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖలో గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం పెగాసెస్ పై హౌస్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడడంపై నిబంధనలు చూపుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ షోకాజ్ పై సరైన వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకోనే అవకాశం ఉంది.