యువతిపై సర్పంచ్ తనయుడి అత్యాచారయత్నం... ప్రతిఘటిస్తోందని దారుణంగా కొట్టిచంపిన కామాంధుడు

Arun Kumar P   | Asianet News
Published : Apr 05, 2022, 10:19 AM IST
యువతిపై సర్పంచ్ తనయుడి అత్యాచారయత్నం... ప్రతిఘటిస్తోందని దారుణంగా కొట్టిచంపిన కామాంధుడు

సారాంశం

ఓ కామాంధుడు యువతిపై అత్యాచారానికి యత్నించగా ప్రతిఘటించడంతో అతి దారుణంగా కొట్టిచంపిన అమానుషం పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. సదరు దుర్మార్గుడు సర్పంచ్ కొడుకు కావడంతో గ్రామపెద్దలు బాధిత కుటుంబంతో రాజీకుదిర్చి గుట్టుగా అంత్యక్రియలు జరిపేందుకు సిద్దమవగా పోలీసులు అడ్డుకున్నారు. 

ఏలూరు: ఈ రాకెట్ యుగంలోనూ రాతికాలంలో మాదిరిగా మహిళలపై పురుషుల జులుం కొనసాగుతోంది. అమ్మాయిలు కేవలం తమ కామవాంఛ తీర్చేందుకే పుట్టారన్నట్టుగా కొందరు మృగాళ్లు వ్యవహరిస్తున్నారు. ఇలా పసిపాప నుండి పండు ముసలి వరకు వయసుతో తేడా లేకుండా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు కొందరు కామాంధులు. ఇలాగే ఓ దుర్మార్గుడు యువతిపై అత్యాచారయత్నానికి  పాల్పడి చివరకు అతి కిరాతకంగా చంపేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... ప. గో జిల్లా కాళ్ల మండలం పల్లిపాలెం గ్రామ సర్పంచ్ కుమారుడు సాయి ప్రసాద్ జులాయిగా తిరుగుతుండేవాడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గ్రామస్తులపై పెత్తనం చెలాయించేవాడు. ఇలా ఆకతాయిగా తిరిగే అతడు అదే గ్రామానికి చెందిన కల్యాణి(19) అనే యువతిపై కన్నేసాడు.  

కల్యాణిని ఎలాగయినా అనుభవించాలన్న నీచపు బుద్దితో రగిలిపోయిన సాయిప్రసాద్ అదును చూసుకుని అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే కల్యాణి మాత్రం అతడికి లొంగిపోకుండా తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఈ దుర్మార్గుడు మరింత రాక్షసంగా మారిపోయి యువతిని అతిదారుణంగా కొట్టాడు. ఆ దెబ్బలను తాళలేక కల్యాణి మృతిచెందింది. 

యువతి హత్యాచారం ఘటనగురించి బయటపడకుండా చూసి తన కొడుకును కాపాడుకునేందుకు గ్రామ సర్పంచ్ ప్రయత్నించాడు. బాధిత కుటుంబంతో గ్రామ పెద్దలతో మాట్లాడించి బ్రతిమాలో, భయపెట్టో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆపగలిగాడు. దీంతో అసలేమీ జరగలేదు... సాధారణంగా యువతి మరణించింది అన్నట్లుగా అంత్యక్రియలకు సిద్దమయ్యారు. 

అయితే యువతిపై అత్యాచారయత్నం, ప్రతిఘటించడంతో హత్యకు పాల్పడినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పల్లిపాలెం గ్రామానికి చేరుకున్న పోలీసులు చివరినిమిషంలో దహనసంస్కారాన్ని అడ్డుకున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  

ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువతిపై అఘాయిత్యానికి యత్నించి చివరకు ఆమె ప్రాణాలనే బలితీసుకున్న యువకుడిని, కొడుకు నీచపుపనిని కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నించిన గ్రామ సర్పంచ్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం