ఏపీలో మహిళా ఓటర్లదే హవా.. 10 లక్షల ఓట్లు తొలగింపు, కొత్త జాబితా ప్రకటించిన ఈసీ

By Siva KodatiFirst Published Nov 9, 2022, 9:54 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా వున్నట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. కొన్ని కారణాల కారణంగా 10,52,326 మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించామన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. దీని ప్రకారం నవంబర్ 9 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 3,98,54,093 మంది ఓటర్లు వున్నారని.. వీరిలో 2,01,34,621 మంది మహిళా ఓటర్లు కాగా, 1,97,15,614 మంది పురుష ఓటర్లు ఉన్నారని ముఖేష్ చెప్పారు. అలాగే రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 68,115 మంది సర్వీస్ ఓటర్లు.. 3,858 మంది ట్రాన్స్‌జెండర్లు... 78,438 మంది 18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్లని ఆయన తెలిపారు. 

కొన్ని కారణాల కారణంగా 10,52,326 మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించామని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. దీని కారణంగా ఓటర్ల సంఖ్య గతేడాది కంటే 8,82,366 తగ్గిందన్నారు. ఈ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం అనంతపురం (19,13,813 ఓటర్లు), కర్నూలు (19,13,654 ఓటర్లు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (18,99,103 ఓటర్లు)  జిల్లాల్లో అత్యధిక స్థాయిలో ఓటర్లు వున్నారని మీనా తెలిపారు. అలాగే అల్లూరి సీతారామరాజు (7,15,990 ఓటర్లు), పార్వతీపురం మన్యం (7,70,175 ఓటర్లు) బాపట్ల (12,66,110 ఓటర్లు) జిల్లాల్లో అత్యల్ప స్థాయిలో ఓటర్లు వున్నారని ఆయన పేర్కొన్నారు. 

ముసాయిదా ఓటర్ల జాబితాకు సంబందించి క్లైమ్స్ , అభ్యంతరాలను ఈ ఏడాది డిసెంబర్ 8 వరకూ స్వీకరిస్తామని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఓటరు కార్డు కోసం ఆధార్ ను తప్పనిసరి చేయటంలేదని, అయితే ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే 60 శాతం మేర పూర్తి అయ్యిందని ఆయన తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియలో  వాలంటీర్ల సేవలను వాడుకోవద్దని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రులు, టీచర్ల ఓటర్ల నమోదు ప్రక్రియపై ఫిర్యాదులు వచ్చాయని,  దీనిపై  విచారణ జరిపి తప్పుడు ధృవీకరణ ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. 

click me!