
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నియోజకవర్గాల సమీక్షలో భాగంగా బుధవారం పులివెందుల, వెంకటగిరి, నూజివీడు, తుని, పాడేరు, పాలకొండలకు చెందిన నేతలు, కార్యకర్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ తీరుతో ఆయనను ఎన్నుకున్న పులివెందులకు కూడా చెడ్డపేరు వస్తోందన్నారు. తన పాలన, విద్వేష రాజకీయాల కారణంగా సొంత నియోజకవర్గానికి కూడా చెడ్డపేరు తెస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. బాబాయ్ హత్య కేసులో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ దోషులను కాపాడటం స్థానిక ప్రజలకు నచ్చడం లేదన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌కు అదే చివరి ఛాన్స్ అవ్వనుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. వైసీపీ పట్ల ప్రజల్లో వున్న వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవాలని ఆయన టీడీపీ నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపై పోరాటం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రజలకు దగ్గరకావాలని చంద్రబాబు సూచించారు.
ALso Read:చంద్రబాబు కాన్వాయ్ మీద రాళ్ల దాడి.. పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిదేమిటంటే..?
ఇకపోతే.. నియోజకవర్గాల సమీక్షలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 126 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో ఆయన మాట్లాడారు. పార్టీ కమిటీలు, మెంబర్‌షిప్ వంటి అంశాలపై చంద్రబాబు ఆరా తీశారు. ఎక్కడా గ్రూపులు కట్టరాదని.. అందరినీ కలుపుకుని వెళ్లాలని ఇన్‌ఛార్జ్‌లకు సూచించారు. వారి పనితీరుపై తర్వాత నివేదిక తెప్పించుకుంటానని చంద్రబాబు తెలిపారు. పనితీరు మెరుగుపరచుకోకపోతే.. అందుకు తగినట్లుగా నిర్ణయాలు వుంటాయని హెచ్చరించారు.
టీడీపీలో చేరిన అచంట దళిత నేతలు :
ఇకపోతే.. చంద్రబాబు సమక్షంలో ఆచంట నియోజకవర్గ దళిత నేతలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజావేదికతో ప్రారంభమైన విధ్వంసం రాష్ట్రం అంతటా విస్తరించిందన్నారు. పవన్ కళ్యాణ్ సభ నిర్వహణకు స్థలం ఇచ్చారని ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చేశారని చంద్రబాబు ఆరోపించారు. విశాఖలోనూ పేదల ఇళ్లు కూల్చేశారని, ఇది పేద వాళ్ల జీవితాలను కూల్చే ప్రభుత్వమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు సంబంధించి టీడీపీ హయాంలో అమలు చేసిన 25 కార్యక్రమాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. వైసిపికి వ్యతిరేకంగా పోరాడటానికి అన్ని వర్గాలు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తలపై తుపాకీ పెట్టి ప్రజల ఆస్తులను వైసిపి నేతలు కొట్టేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.