నేడు కాబినెట్ భేటీ: కొత్త జిల్లాలు, ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ సహా...

By Sreeharsha GopaganiFirst Published Jul 15, 2020, 9:25 AM IST
Highlights

కాసేపట్లో ఏపీ కెబినెట్ భేటీ అవనుంది. సచివాలయంలోని ఫస్ట్ బ్లాకులో 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభమవనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి కమిటీ వేసే అంశంపై కెబినెట్లో చర్చ జరగనుంది. 

కాసేపట్లో ఏపీ కెబినెట్ భేటీ అవనుంది. సచివాలయంలోని ఫస్ట్ బ్లాకులో 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభమవనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి కమిటీ వేసే అంశంపై కెబినెట్లో చర్చ జరగనుంది. 

శాండ్ కార్పోరేషన్ ఏర్పాటుకు కూడా నేడు మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్సుపోర్ట్ పాలసీపై కెబినెట్లో ప్రస్తావన ఉండనుంది. 

విద్యా శాఖలో నాడు-నేడు కార్యక్రమం అమలుపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించనున్నారు. వివిధ శాఖల్లో కొత్త పోస్టులకు సైతం కాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను సైతం ఖరారు చేయనున్న కెబినెట్.

ఇకపోతే ఈ కొత్తజిల్లాల ఏర్పాటు జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు తలనొప్పులు తెచ్చిపెట్టేలా కనబడుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు  ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.ఇటీవల జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో  జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో తొలుత ఉన్న 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించింది ఆ ప్రభుత్వం. తెలంగాణ బాటలోనే ఏపీ ప్రభుత్వం కూడ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనుంది.

also read:తెలంగాణ బాటలోనే ఏపీ: మరో 12 జిల్లాల ఏర్పాటుకు సర్కార్ కసరత్తు
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో క్షేత్రస్థాయిలో ప్రజలు కొత్త డిమాండ్లను లేవనెత్తుతున్నారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని  ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కొత్త జిల్లాల విషయంలో ప్రజా ప్రతినిధులు, పార్టీలు కూడ తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నాయి.  మదనపల్లిని కూడ జిల్లా చేయాలనే డిమాండ్ నెలకొంది.

తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడ కొత్త జిల్లాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగితే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి శూన్యంగా మారనుందని బుధవారం నాడు వ్యాఖ్యానించారు. 

జిల్లాలో అభివృద్ధి చెందిన ఎచ్చెర్ల, పాలకొండ, రాజాం ప్రాంతాలు కొత్త జిల్లాల విభజనలో భాగంగా విజయనగరం జిల్లాలో కలసిపోతాయన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. అదే జరిగితే జిల్లా అభివృద్ధి 80 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ప్రజలు, నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలు ఏర్పాటు చేయాలని ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వానికి సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయవద్దని కోరారు. అదే జరిగితే ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం దొరుకుతోందన్నారు.  ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు.

ప్రజల మనోభావాలు సున్నితమైనవి... అవి దెబ్బతినకుండా ప్రజల అభిప్రాయాల మేరకు జిల్లాల పునర్విభజన జరుగుతోందని  ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. 

click me!