
మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణ (ap cabinet reshuffle) అధికార వైసీపీలో అసంతృప్తి సెగలు రేపుతోంది. మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆశిస్తున్న వారికి అధిష్టానం మొండిచేయి ఇవ్వడంతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాచర్ల ఎమ్మెల్యే (macherla mla) పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి (pinnelli ramakrishna reddy) మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగా మాచర్ల మున్సిపల్ ఛైర్మన్‌తో పాటు 30 మంది కౌన్సిలర్లు ధర్నా నిర్వహించారు. కష్టకాలంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పార్టీకి అండగా వున్నారని గుర్తుచేశారు. వెనకబడ్డ పల్నాడు ప్రాంతానికి మంత్రి పదవి కేటాయిస్తే అభివృద్ధి చెందుతుందని భావించామని చెబుతున్నారు. పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని మాచర్ల నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.
మరోవైపు సీనియర్ నేత, నగరి ఎమ్మెల్యే రోజాకు (rk roja) మంత్రి పదవి విషయంలో మరోసారి నిరాశే ఎదురైనట్టుగా తెలుస్తోంది. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న రోజాకు ఈసారి కూడా సీఎం జగన్ కేబినెట్‌లో (ys jagan cabinet) చోటుదక్కలేదని సమాచారం. దీంతో ఆమె అభిమానులు, అనుచరులకు నిరాశే మిగిలింది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో కేబినెట్ బెర్త్‌పై ఎమ్మెల్యే రోజా ఆశలు పెట్టుకున్నా సంగతి తెలిసిందే. మరోవైపు రోజాకు ఈసారి కేబినెట్ బెర్త్ గ్యారంటీ అనే ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా రోజా వరుసగా పలు ఆలయాలకు వెళుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు ఆమె జబర్దస్త్ షో జడ్జిగా తప్పుకుంటున్నారనే ప్రచారం జరిగింది. దీంతో రోజాకు కేబినెట్ బెర్త్ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది.
రోజాకు మంత్రివర్గంలో చోటుదక్కడంతోనే మొక్కులు తీర్చుకుంటుందని కొందరు.. మంత్రి పదవి దక్కాలని పూజలు చేస్తున్నారని మరికొందరు చెప్పుకొచ్చారు. దీంతో రోజాకు మంత్రి వర్గంలో చోటుదక్కుతుందా..? లేదా..? అనేది మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. మంత్రి వర్గంలో రోజాకు చోటు లభించలేదని తెలుస్తోంది. దీంతో రోజా.. హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. రేపు జరిగే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఆమె హాజరయ్యే అవకాశం లేదని సమాచారం. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి రాజకీయ సమీకరణాల వల్లే రోజాకు మంత్రిపదవి దూరమైనట్టుగా తెలుస్తోంది.
సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత.. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy), నారాయణ స్వామి (narayana swamy) మంత్రులుగా తీసుకున్నారు. అయితే అప్పుడు చెప్పినట్టుగానే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్.. మంత్రుల చేత రాజీనామా చేయించారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి కేబినెట్ రేస్‌లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే పెద్దిరెడ్డి రెండో దఫా మంత్రిగా కొనసాగుతుండటంతో.. ఉమ్మడి జిల్లాలో అదే సామాజికవర్గానికి చెందిన రోజా, భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదని తెలుస్తోంది. మరోవైపు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనకు మంత్రి వద్దని చెప్పడంతో.. ఆయనకు తుడా ఛైర్మన్ పదవీ కాలాన్ని పొడగించారు.