ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ... టీటీడీ బోర్డు వివాదం, సినిమా టికెట్లపై కీలక చర్చ

By Siva KodatiFirst Published Oct 28, 2021, 9:25 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం (ap cabinet meeting) నేడు భేటీకానుంది. గురువారం ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ys jagan mohan reddy) అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ భేటీలో దాదాపు 20 నుంచి 25 అంశాలపై చర్చించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం (ap cabinet meeting) నేడు భేటీకానుంది. గురువారం ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ys jagan mohan reddy) అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ భేటీలో దాదాపు 20 నుంచి 25 అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా సినిమా టిక్కెట్లను (movie tickets) ఆన్‌లైన్‌ విక్రయానికి సంబంధించి సినిమాటోగ్రఫీ, చట్టసవరణపై చర్చిస్తారు. టీటీడీ బోర్డు (ttd board) 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంపై హైకోర్టు (ap high court)స్టే ఇవ్వడంతో చట్ట సవరణకు సిద్ధం చేసిన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేయనుంది. అలాగే దేవాదాయశాఖకు సంబంధించి నిర్ణయాలు తీసుకోనున్నారు. 

అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుపై కేబినెట్ చర్చించే అవకాశం వుంది. దీనితో పాటు అమ్మఒడి పథకం అమలు, రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. టీటీడీ బోర్డు సభ్యులుగా 52 మంది నియామకం సహా ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో చట్టసవరణకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే కేబినెట్ సమావేశం ఎజెండాలో టీటీడీ పాలకమండలి ఎజెండాను చేర్చింది. 

Also Read:జగన్ వ్యూహాత్మకం.. టీటీడీ కొత్త బోర్డుపై చట్ట సవరణ, ఎల్లుండి కేబినెట్ భేటీలో అజెండా ఇదే

కాగా, సెప్టెంబర్ 15వ తేదీన జీవో 245 ద్వారా 25 మంది పాలకవర్గ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. జీవో 568 ద్వారా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించారు. జీవో 569 ద్వారా ఇద్దరిని ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించారు. ఈ జంబో కార్యవర్గంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విషయమై బీజేపీ నేతలు ఏపీ గవర్నర్‌కి (ap governor) కూడా ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ నేత ఉమామహేశ్వరనాయుడు, హిందూ జనశక్తి సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు జి. లలిత్ కుమార్ లు టీటీడీలో జంబో పాలకవర్గం ఏర్పాటు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మూడు పిటిషన్లపై ఏపీ హైకోర్టు సెప్టెంబర్ 22న విచారణ నిర్వహించింది. అనంతరం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 

మరోవైపు సాయంత్రం ఈ రోజు సీఎం జగన్‌ ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను (biswabhusan harichandan) కూడా కలవనున్నారు. నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ జీవిత సాఫల్య, వైఎస్సార్‌ సాఫల్య పురస్కారాలను అందజేయనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయాలని గవర్నర్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించనున్నారు. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకం, దేవాదాయ భూముల లీజు, ఆ శాఖలో నిఘా విభాగం ఏర్పాటు వంటి వివిధ అంశాలను గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని సమాచారం. వచ్చే నెల అసెంబ్లీ సమావేశాలపై కూడా నివేదించనున్నారు.

click me!