వినాయకచవితి వివాదం.. .దమ్ముంటే యువకులతో ఆ మాట చెప్పండి: వెల్లంపల్లికి విష్ణువర్ధన్ కౌంటర్

By Arun Kumar PFirst Published Sep 6, 2021, 5:23 PM IST
Highlights

వినాయకచవితి వేడుకలపై జగన్ సర్కార్ విధించిన ఆంక్షలపై వివాదం చెలరేగుతున్న వేళ దేవాదాయ మంత్రి వెల్లంపల్లికి బిజెపి నాయకుడు విష్ణువర్దన్ రెడ్డి కౌంటరిచ్చారు. 

అమరావతి: వినాయక చవితి వేడుకలపై వైసిపి సర్కార్ ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బిజెపి శ్రేణులు నిరసనకు దిగాయి. అయితే ఈ నిరసనలపై స్పందిస్తూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏపీ బిజెపి నేతలపై విమర్శలు గుప్పించారు. తాజాగా దేవాదాయ మంత్రికి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి కౌంటరిచ్చారు. 

''దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మా భారతీయ జనతా పార్టీ పట్ల, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పట్ల వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. రాష్ట్రంలో మతాలను రెచ్చగొడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది మీరు, మీ పార్టీ మాత్రమే'' అని ఆరోపించారు. 

READ MORE  వినాయకచవితి వివాదం... ఇలాగయితే మీ మీదా కేసులు తప్పవు: బిజెపి శ్రేణులకు మంత్రి వెల్లంపల్లి వార్నింగ్

''మంత్రి వెల్లంపల్లికి దమ్ముంటే రాష్ట్రంలోని ఒక్క వినాయక మండపం దగ్గరికయినా వెళ్లి యువకులకు విగ్రహం పెట్టవద్దని చెప్పగలరా? ఒక్కో మతానికి సంబంధించిన పండుగలకు ఒక్కో రకమైన అదేశాలిస్తూ మతాల మధ్యన చిచ్చు పెట్టేది మీరు,మీ జగన్మోహన్ రెడ్డి, మీ వైసీపీ ప్రభుత్వం'' అని వెల్లంపల్లిని విమర్శించారు. 

''కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వినాయక మండపాలు పెట్టుకోవటానికి అనుమతులు ఇవ్వమని అడిగితే మాకు మతాన్ని అంటగట్టి మాట్లాడతారా? వచ్చేది పండుగల కాలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి... అవసరమైన మేరకు మాత్రమే చర్యలు తీసుకోండి అని కేంద్రం చెప్పింది. కానీ హిందూ ధర్మాన్ని పూర్తిగా అణచివేయాలనే ధోరణితో పాలన సాగిస్తున్న మీరు ఏకంగా మండపాలనే పెట్టుకోవద్దు, ఇళ్ళలోనే పండుగ చేసుకోండి, ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని అదేశాలిచ్చారు. అలాంటిది కేంద్రం ఆదేశాలని అసత్యాలుగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు?'' అని ప్రశ్నించారు. 

''హిందూ ధర్మంపై మీరు చూపిస్తున్న వివక్షను రాష్ట్రంలోని హిందువులంతా గమనిస్తున్నారు. విజ్ఞనాయకుడికే విజ్ఞాలు కలిగిస్తున్న మీకు త్వరలో ఆ వినాయకుడే యావత్ హిందూ సమాజం ద్వారా బుద్ధి చెబుతాడు'' అని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. 
 

click me!