పట్టించుకోవాల్సిన ఇష్యూ కాదు : పవన్- చంద్రబాబు భేటీపై తేల్చేసిన బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

By Siva KodatiFirst Published Oct 18, 2022, 4:17 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు , పవన్ భేటీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు.
 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తనకు బీజేపీతో సెట్ కావడం లేదని మీడియా సమావేశంలో చెప్పిన కాసేపటికే చంద్రబాబును పవన్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో బీజేపీతో పవన్ తెగదెంపులు చేసుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు , పవన్ భేటీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. నిన్న సోము వీర్రాజును కూడా పవన్ కలిశారని ఆయన గుర్తుచేస్తున్నారు. 

పవన్ - బీజేపీ విడిపోవాలని అనుకునేవారే హైప్ తీసుకొస్తున్నారంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది పవన్, బీజేపీల లక్ష్యమని ఆయన అన్నారు. జనసేన పట్ల విశాఖలో జరిగిన పలు పరిణామాలపై బీజేపీ స్పందించిందని విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు. పవన్ వెంటే ఏపీ నాయకత్వం , బీజేపీ కేంద్ర పెద్దలు వున్నారని ఆయన స్పష్టం చేశారు. జనసేన, బీజేపీలు కలిసి మరింత వేగంగా ప్రజాసమస్యలపై కొట్లాడాలని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మీడియాకు అందుబాటులోకి రావడం లేదు. తాజా పరిణామాలపై ఆయన హైకమాండ్‌తో చర్చిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 
 

click me!