
ఏపీ ప్రభుత్వం, వైఎస్ జగన్ పాలనపై విరుచుకుపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మిషన్ పథక ప్రయోజనాలను ఏపీ ప్రభుత్వం సరిగా వినియోగించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. జగన్‌ది వనరులు వున్నా.. వాటిని ఉపయోగించుకోలేదని అసమర్థ ప్రభుత్వమని వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయుష్ మిషన్ కింద ఏపీకి కావాల్సిన నిధుల కేటాయింపులను కేంద్రం చేసినప్పటికీ.. జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం, అవగాహన లేమి కారణంగా ఈ విభాగంలో అభివృద్ధి జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో జగన్ ప్రభుత్వం విఫలమైందని వీర్రాజు విమర్శించారు.
గన్నవరంలో 100 పడకలతో ఆయుష్ ఆసుపత్రిని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా వున్నప్పటికీ.. జగన్ ప్రభుత్వం మాత్రం భూమి కేటాయించలేకపోయిందని ఆయన దుయ్యబట్టారు. గతంలో 2015లో కాకినాడలో 100 పడకల ఆయుష్ హాస్పిటల్ నిర్మాణానికి కేంద్రం ప్రతిపాదనలు పంపిందని... కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆసుపత్రి నిర్మాణం నిలిచిపోయిందని వీర్రాజు దుయ్యబట్టారు.
Also Read:సోము వీర్రాజు వ్యాఖ్యలు: చంద్రబాబుతో బిజెపి నెయ్యం, వైఎస్ జగన్ కు చెక్
అలాగే విశాఖలో ఆయుర్వేదిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చినప్పటికీ కుటుంబ పార్టీల వైఫల్యం కారణంగా అది కూడా ఏపీకి దక్కలేదని వీర్రాజు అన్నారు. ఆయుష్ కింద ఏపీకి రూ.29 కోట్లను కేంద్రం విడుదల చేసినప్పటికీ.. ఆ తరహా సేవలను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు విఫలమయ్యారని సోము వీర్రాజు ట్వీట్ చేశారు.