కృష్ణంరాజు మృతిపై ఏపీ బిజెపి చీఫ్ దిగ్భ్రాంతి... ప్రభాస్ ఫ్యామిలీకి వీర్రాజు ఫోన్

By Arun Kumar PFirst Published Sep 11, 2022, 8:31 AM IST
Highlights

ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజు మృతిపై ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కృష్ణం రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వీర్రాజు కోరుకున్నారు. 

అమరావతి : ప్రముఖ తెలుగు సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. రెబల్ స్టార్ మరణవార్త తెలియగానే ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసిన వీర్రాజు ధైర్యం చెప్పారు. నటుడిగా తెలుగు సినీ పరిశ్రమకే కాదు కేంద్ర మంత్రిగా కృష్ణంరాజు దేశానికి సేవచేసారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు సోము వీర్రాజు పేర్కొన్నారు. 

కృష్ణంరాజు మృతి తనను ఎంతగానో కలచివేసిందని వీర్రాజు అన్నారు. ఉభయగోదావరి జిల్లాల నుండి బిజెపి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవిని పొందిన కృష్ణంరాజు రాష్ట్రానికి, దేశానికి సేవలందించారన్నారు. బిజెపిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషిచేసారని అన్నారు. కేంద్ర మంత్రిగా బిజీగా వున్నప్పటికి తనను నమ్మి గెలిపించిన నరసాపురం ప్రజలను కృష్ణంరాజు మరిచిపోలేదని... ఆ పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని సోము వీర్రాజు గుర్తుచేసారు.  

read more  స్నేహం కోసం నిలిచిన కృష్ణం రాజు.. చిరంజీవి జీవితంలో మరచిపోలేని సంఘటన

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు రాజకీయాల్లోనూ రాణించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి తరపున గెలిచిన అతి తక్కువమంది నాయకుల్లో కృష్ఱంరాజు ఒకరు. బిజెపి లీడర్లు, క్యాడర్ లేని నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీచేసిన కృష్ణంరాజు తన సినీగ్లామర్ తో కాంగ్రెస్, టిడిపిలను మట్టికరిపించారు. ఇలా 1999లో నరసాపురం ఎంపీగా గెలుపొందిన కృష్ణంరాజు వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసారు. 

ఇలా సినీనటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారిన కృష్ణంరాజు ఏపీ అభివృద్దికి కృషిచేసారు. అయితే వివిధ కారణాలతో ఆయన రాజకీయాలకు దూరంగా వున్నారు. కానీ మరోసారి బిజెపి నేతృత్వంలోని ఎన్టిఏ అధికారంలోకి వచ్చాక మరోసారి కృష్ణంరాజు పేరు రాజకీయాల్లో బాగా వినిపించింది. ఆయన సేవలను మళ్లీ వినియోగించుకోవాలని కేంద్రం బావిస్తున్నట్లు... ఏదయినా రాష్ట్రానికి గవర్నర్ గా నియమించే అవకాశాలున్నాయని వార్తలు ప్రచారమయ్యాయి. కానీ అలాంటివేవీ జరక్కుండానే కృష్ణంరాజు కన్నుమూసారు. 

ఇక సినీరంగంలో అలనాటి అగ్రనటులు ఎన్టీఆర్, నాగేశ్వరరావు తర్వాతి తరం హీరోల్లో కృష్ణంరాజు ఓ వెలుగు వెలిగారు. 1966లో వచ్చిన చిలకా గోరింకా చిత్రంతో కృష్ణంరాజు తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో హీరోగా, విలన్ గా మెప్పించారు. ఇక కృష్ణంరాజు వారసుడిగా వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రభాస్ తో పాటు వివిధ సినిమాల్లో నటించిన కృష్ణంరాజు నేటి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 

click me!