ఏపీ ఆర్ధిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి . ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.4.42 లక్షల కోట్లేనని కేంద్రం చెప్పడంతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఇబ్బందిగా మారిందని ఆమె అందులో పేర్కొన్నారు.
ఏపీ ఆర్ధిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని ఆమె కలిశారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్ధిక అంశాలపై పురందేశ్వరి వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.4.42 లక్షల కోట్లేనని కేంద్రం చెప్పడంతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఇబ్బందిగా మారిందని ఆమె అందులో పేర్కొన్నారు. ఏపీ ఆర్ధిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయాలని పురందేశ్వరి కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మద్యం స్కాంపై జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ .. బీజేపీ ప్రతిష్ట దెబ్బతినేలా ప్రచారం చేస్తోందని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్పోరేషన్ల రుణాలు, గ్యారంటీలను పరిగణనలోనికి తీసుకుంటూ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆమె కోరారు. గడిచని నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్, అకౌంటింగ్ విధానం అస్తవ్యస్తంగా వుందని పురందేశ్వరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ద్వారా వచ్చిన ఏడాదికి రూ.30 వేల కోట్ల మేర ఆదాయం లెక్కలోకి రావడం లేదని నిర్మలమ్మ దృష్టికి తీసుకెళ్లారు .
Also Read: ఆ విషయం అడిగారు..: అమిత్ షాతో లోకేష్ భేటీ, చంద్రబాబు అరెస్ట్‌పై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
ఇకపోతే.. పురందేశ్వరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. మంగళవారం చిత్తూరు జిల్లాలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో నారాయణ స్వామి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో చంద్రబాబు కోసం కోవర్టుగా పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు రకరకాలుగా చెబుతున్నారని నారాయణ స్వామి మండిపడ్డారు.
చంద్రబాబు జైలులో అన్నాన్ని ప్రభుత్వం పెట్టడం లేదని స్వయంగా ఆయన భార్య భువనేశ్వరి పంపుతున్నారని డిప్యూటీ సీఎం అన్నారు. జైల్లో దోమలు కుడుతున్నాయని అంటున్నారని.. వాటి ద్వారా మేం ఏమైన విషం పంపిస్తున్నామా అని నారాయణ స్వామి ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది నిజమా కాదా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబును పంపించేసి నారా లోకేష్‌ను సీఎంగా చేయాలనే ఉద్దేశ్యంలో టీడీపీ నేతలు వున్నారని నారాయణ స్వామి ఆరోపించారు. వాళ్లు ఒక స్టేట్‌మెంట్ కూడా నిజం చెప్పడం లేదని డిప్యూటీ సీఎం దుయ్యబట్టారు.