మూడు రాజధానుల అంశం మరోసారి తెరమీదికి వచ్చింద. ఇవాళ మూడు రాజధానులపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.ఈ మేరకు అనుబంధ ఎజెండాను సెక్రటరీ జారీ చేశారు.
అమరావతి: Andhra Pradesh Assembly లో గురువారం నాడు మూడు రాజధానులపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇవాళ్టి ఎజెండాకు అనుబంధంగా మూడు రాజధానులపై స్వల్పకాలిక చర్చ జరగనుందని అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చారు.
ఏపీలో YS Jagan ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత Three Capitals అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతో జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చింది. అమరావతిని శాసన రాజధాని, కర్నూల్ ను న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని జగన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు CRDA చట్టాన్ని రద్దు చట్టంతో పాటు మూడు రాజధానుల చట్టాలను చేసింది.
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయని 2019 డిసెంబర్ 17న సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు.ఆ తర్వాత మండలిలో ప్రవేశపెట్టారు. అక్కడ ఆమోదం పొందకపోవడంతో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏను రద్దు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీనిపై రాజధాని రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంత రైతులు ఆందోళన నిర్వహించారు.
అయితే మూడు రాజధానులపై TDP సహా పలు పార్టీలు అమరావతి ప్రాంత రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే 2021 నవంబర్ 23న హైకోర్టులో జగన్ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకొంటామని ప్రకటించింది. అదే రోజున అసెంబ్లీలో ఈ బిల్లును వెనక్కి తీసకొంటూ బిల్లును ప్రవేశ పెట్టింది.
మూడు రాజధానుల అంశంపై ఈ నెల 3వ తేదీన ఏపీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారంగానే ముందుకు వెళ్లాలని హైకోర్టు తేల్చి చెప్పింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారంలో అసెంబ్లీకి లేదని తేల్చి చెప్పింది. అయితే ఈ వాదనను ప్రభుత్వం కొట్టిపారేసింది. చట్ట సభలు చట్టాలు చేసేందుకే ఉన్నాయని కూడా గుర్తు చేస్తున్నారు.
మూడు నెలల్లో రైతులకు ప్లాట్లను అభివృద్ది చేసి ఇవ్వాలని కూడా ఏపీ హైకోర్టు ఆదేశించింది.
ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అమరావతి రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అయితే ఏపీ అసెంబ్లీలో ఇవాళ స్వల్ప కాలిక చర్చ చేపట్టడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. రేపటితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.ఈ తరుణంలో ఈ అంశంపై చర్చ చేయాలని నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.
గతంలో మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కు తీసుకొన్న సమయంలో న్యాయ పరమైన ఇబ్బందులు రాకుండా ఉండేలా కొత్త బిల్లును త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశ పెడతామని సీఎం జగన్ గత ఏడాది నవంబర్ మాసంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు.
ఈ విషయమై ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఏపీ అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ జరగడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. ఇవాళ కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు. నిన్న సభలో చోటు చేసుకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలను నిన్న, ఇవాళ కూడా సభ నుండి సస్పెండ్ చేశారు.