పంట రుణ మాఫీపై ఊసరవెల్లిలా మాటలు: చంద్రబాబుపై జగన్ ఫైర్

By narsimha lodeFirst Published Sep 21, 2022, 4:53 PM IST
Highlights

చంద్రబాబు వ్యవహరించిన తీరుతో రాజకీయ నేతలు, ఎన్నికల మేనిఫెస్టోలు అంటేనే నమ్మకం లేకుండా పోయిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.  ఇవాళ అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. 

అమరావతి: పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. దీంతో రాజకీయ నేతలన్నా, ఎన్నికల మేనిఫెస్టోలన్నా ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందన్నారు. కానీ తమ ప్రభుత్వం మూడేళ్లుగా ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంతో  రాజకీయనేతలు, మేనిఫెస్టోలంటే నమ్మకం పెరిగిందని  సీఎం జగన్ వివరించారు.

బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై జరిగిన చర్చలో సీఎం జగన్ పాల్గొన్నారు. రూ.87, 612 కోట్ల రుణమాఫీ చేస్తామని  చంద్రబాబునాయుడు 2014లో ఎన్నికల హామీ ఇచ్చారన్నారు. కానీ ఐదేళ్లలో రూ. 15 వేల కోట్లు మాత్రమే రుణ మాఫీ చేశారని జగన్ విమర్శించారు. పంట రుణాలు చెల్లించని కారణంగా రైతులకు భారంగా మారిందన్నారు. చంద్రబాబు పంట రుణాలను మాఫీ చేయకపోతే  రైతులపై మరో రూ. 87,612 కోట్ల భారం పెరిగిందని వైఎస్ జగన్ చెప్పారు. రైతుల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి ఆ తర్వాత ఊసరవెల్లిలా మాట మార్చారన్నారు. 

ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియోను, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు  మీడియా సమావేశంలో మాట్లాడిన  వీడియోను ఈ సందర్భంగా జగన్ చూపించారు.సున్నా వడ్డీ కింద నేరుగా రైతుల ఖాతాల్లోకి వడ్డీని జమ చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.మూడేళ్లలో 65.65 లక్షల మంది రైతులకు రూ. 1282 కోట్లను చెల్లించినట్టుగాసీఎం జగన్ వివరించారు.  రూ. 2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

also read:చంద్రబాబు, కరువు కవలపిల్లలు: ఏపీ అసెంబ్లీలో జగన్

ఏ సీజన్ లో నష్టాన్ని అదే సీజన్ లో రైతులకు  పరిహరం చెల్లిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. 3 ఏళ్లలో 20 లక్షల మంది రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని అందించామని సీఎం జగన్ వివరించారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు  విప్లవాత్మక మార్పుగా ఏపీ సీఎం జగన్ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు  కూడా ప్రశంసించిందని ఏపీ సీఎం జగన్ గుర్తు చేశారు.  ఆర్ బీ కే  ల ద్వారానే ప్రభుత్వం సర్టిఫై చేసిన ఎరువులు, విత్తనాలను అందిస్తున్నామన్నారు. విత్తనం నుండి పంట విక్రయం వరకు ఆర్ బీ లు కీలకంగా మారాయని సీఎం జగన్ చెప్పారు. 

వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్  ల్యాబ్స్  ద్వారా రైతులు తాము పండించిన పంటల నాణ్యతను నిర్ధారించుకొనేలా ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. 147  అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన సెంటర్లన్నీ  ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు.

click me!