
ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. అయ్యన్న నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు. నిరసన తెలియజేయడానికి వచ్చిన వ్యక్తిపై దాడి తప్పని స్పీకర్ అన్నారు. టీడీపీ జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారని తమ్మినేని ఎద్దేవా చేశారు. లోకేశ్‌ను ఎవరూ పట్టించుకోరని సీతారాం ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు అయ్యన్న పాత్రుడు, చంద్రబాబుపై డీజీపీ గౌతం సవాంగ్‌కి వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారిని అరెస్ట్ చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే అంతా జరుగుతోందని.. ఎమ్మెల్యే జోగి రమేష్‌పై దాడిని ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడుతూ.. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్నపాత్రుడు మాట్లాడారని మండిపడ్డారు.
Also Read:ఆ నోళ్లని పినాయిల్‌తో కడగాలేమో: టీడీపీ నేతలపై వైసీపీ నాయకుల తీవ్ర వ్యాఖ్యలు
నిరసన తెలిపేందుకు వెళ్లిన తనపై దాడి చేశారని జోగి రమేశ్ తెలిపారు. గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారని ఆయన ఆరోపించారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబని.. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన వ్యక్తి జగన్ అని రమేశ్ చెప్పారు. శాంతియుతంగా నిరసన తెలిపిన మాపై దాడి చేస్తారా అని జోగి రమేశ్ మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడిని ప్రేరేపించి మాట్లాడింది చంద్రబాబేనని ఆయన ఆరోపించారు.