
నంద్యాల జిల్లాలో 8 మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో వారిని పోలీసు స్టేషన్‌లో ఉంచాలని నంద్యాల డీఈవో ఉత్తర్వులు జారీచేశారు. గతేడాది పదో తరగతి పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్ ఘటనకు సంబంధించి డీఈవో ఈ నోటీసులు జారీ చేసినట్టుగా తెలిసింది. వీరు గతేడాది పదో తరగతి పరీక్షల సమయంలో ఈ 8 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించారు. అయితే వీరు విధులు నిర్వర్తించిన పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది జరిగిన మాస్ కాపీయింగ్ ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు పరీక్షల సమయంలో ఉపాధ్యాయులను పోలీసు స్టేషన్‌లో ఉంచాలని నంద్యాల డీఈవో అనురాధ ఉత్తర్వులు జరీచేశారు.
జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశాల మేరకు డీఈవో అనురాధ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ 8మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను వారు పనిచేసే మండలాల్లోని పోలీసు స్టేషన్‌లలో ఉదయం 9నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక, గతేడాది 10వ తరగతి పరీక్షలో మాస్ కాపీయింగ్ ఘటనలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలన్నీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటలకు ముగియనున్నాయి. ఈ క్రమంలోనే పదో తరగతి విద్యార్థులకు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ పలు సూచనలు చేశారు. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన సూచించారు. ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతిస్తామన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులో అనుమతించబోమని స్పష్టం చేశారు.