
విశాఖపట్నం : వివాహేతర సంబంధాలు కాపురాల్లో చిచ్చు పెడతాయన్న సంగతి తెలిసినా.. క్షణికావేశంలో వాటికి దూరం కాలేక.. హంతకులుగా మారుతున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే సింహాచలంలో మరో ఘటన వెలుగు చూసింది. ఓ భర్త.. కట్టుకున్న భార్యని అతికిరాతకంగా హతమార్చాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. భార్యను కడతేర్చాడు. ఆ తర్వాత ఆ హత్యను సహజమరణంగా చిత్రీకరించాలనుకున్నాడు. కానీ, ఆమె హఠాన్మరణంతో మృతురాలి బంధువులకు అనుమానం కలిగింది. దీనికి.. గతంలో అతని మీద ఉన్న ఫిర్యాదులు తోడయ్యాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. పోలీసుల విచారణలో భార్యను తానే హత్య చేశానని నిందితుడు అంగీకరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళ్తే.. జీవీఎంసీ 98వ వార్డు పరిధి అప్పన్నపాలేనికి సమీపంలోని జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీలో కిలాని శివ (27) అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతనికి 2017లో విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రామలింగాపురం దరితుమ్మేరుపాలేనికి చెందిన శ్రీదేవి(23)తో వివాహం జరిగింది.
తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో మరో వందేభారత్... వారంలో ఆరు రోజులు...
వీరికి ఇద్దరు పిల్లలు. వీరు జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీలో ఉంటున్నారు. వీరిది సొంత ఇల్లు. ఇంటిపై పోర్షన్లో శివ తల్లి, అన్నయ్య ఉంటున్నారు. జీవీఎంసీ 8వజోన్లో శివ చెత్త తరలించే వాహనానికి డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్నాడు. గత కొంతకాలంగా శివకు మరొక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసిన భార్య శ్రీదేవి అతడిని నిలదీసింది. దీంతో అసహనానికి గురైన శివ తరచుగా భార్యను వేధించేవాడు.పెందుర్తి పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా నమోదయింది.
ఈ క్రమంలోనే గురువారం రాత్రి కూడా శివ భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత ఇద్దరు నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో లేచిన శివ శ్రీదేవి ముఖం మీద తలగడ పెట్టి.. మెడకు టవల్ చుట్టి ఊపిరాడకుండా చేశాడు. దీంతో శ్రీదేవి చనిపోయింది. ఆ తర్వాత తాను నిద్రపోయాడు. ఉదయం లేచిన తర్వాత తన ముందుగా అనుకున్న డ్రామాకు తెర తీశాడు. ఆమె నిద్ర లేవడం లేదని కళ్ళు తిరిగి పడిపోయిందని…చుట్టుపక్కల వాళ్లను నమ్మించడానికి ప్రయత్నించాడు.
గోపాలపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే సమాచారం అందుకున్న శ్రీదేవి తల్లిదండ్రులు, బంధువులు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. వైద్యులు ఆమె చనిపోయిందని తెలపడంతో.. ఆమెది సహజ మరణం కాదని భర్త హత్య చేశాడని వారు ఆరోపించారు. శ్రీదేవి తల్లి గుంపాడ రాము తన కూతురి మరణం సహజ మరణం కాదని.. అల్లుడే చంపేశాడని శివ మీద పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో సిఐ అప్పారావు ఆధ్వర్యంలో నిందితుడు శివాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో భార్యను తానే హత్య చేసినట్టుగా అతను ఒప్పుకున్నాడు. దీంతో శ్రీదేవి మృతదేహాన్ని కేజీహెచ్ హాస్పిటల్కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.