Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఈ నెల 23న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే సూచనప్రాయంగా చెప్పేశారు. ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ పరీక్షలకు 6 లక్షల 19 వేల 275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఆంగ్ల మీడియం నుంచి 5.64 లక్షల మంది... తెలుగు మీడియం వారు 51069 మంది పరీక్షలు రాశారు. మార్చి17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పబ్లిక్ పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత వెంటనే మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించారు.
మన మిత్ర వాట్సప్ నంబర్‌లో ఫలితాలు..
ఇంటర్‌మీడియట్ ఫలితాలు విడుదల చేసిన విధంగా పది ఫలితాలను కూడా వాట్సప్‌లోనే విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాలను మనమిత్ర వాట్సప్ నంబర్‌లోనూ 9552300009 చూసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తికాగా... ప్రస్తుతం మార్కుల నమోదు జరుగుతోంది. మరో మూడు, నాలుగు రోజుల్లో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సప్ సేవలతోపాటు, ఆన్‌లైన్‌లో కూడా ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
ప్రారంభమైన ఇంటర్ తరగతులు..
ఏపీలో ఇంటర్ మీడియట్ తరగతులు కొనసాగుతున్నయి. ఈ నెల 1వ తేదీ నుంచి రెండో ఏడాది తరగతులు ప్రారంభంకాగా.. తొలి ఏడాది అడ్మీషన్లను ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభించారు. రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు ఇప్పటి వరకు విడుదలకానప్పటికీ,. పదో తరగతి హాల్ టికెట్లను తీసుకుని ఇంటర్ అడ్మీషన్లను ఇస్తున్నారు. తొలి ఏడాది చేరిన విద్యార్థులందరికీ క్రాష్ కోర్సు అందిస్తున్నారు. ఇప్పటికే అటు ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లో తరగతులు కొనసాగుతున్నాయి.
ఉచితంగానే కళాశాలల్లో తరగతుల నిర్వహణ..
పదో తరగతి ఫలితాలు విడుదల కాకపోవడంతో ఇంటర్ కళాశాలల్లో తొలి ఏడాదికి సంబంధించి ఫీజులు కట్టించుకోవడం లేదు. ఈ పదిహేను రోజులు ఉచితంగానే పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరగడంతో ఇంటర్‌లో చేరికలు కూడా అదీ స్థాయిలో ఉండనున్నాయి.
ఈ ఏడాది నుంచి ఎంబైపీసీ కోర్సు..
ఇంటర్ మీడియట్‌లో ఈ ఏడాది నుంచి ఎంబైపీసీ కోర్సు అందుబాటులోకి వచ్చింది. ఈ కోర్సు చేరిన వారికి ప్రధానంగా అయిదు సబ్జెక్టులు ఉండనున్నాయి. ఈ కోర్స్ తీసుకోవాలన్న ఆసక్తి ఉంటే.. బైపీసీ తీసుకునే వారు మ్యాథ్య్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఎంపీసీ వారు బయోలజీని ఎంపిక చేసుకోవాలి. ఇక సిలబస్‌లో కూడా పలు మార్పులు చేశారు.. మ్యాథ్య్ గతంలో 150 మార్కులు ఉండగా.. ఈ ఏడాది నుంచి దాన్ని 100 మార్కులకు తగ్గించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ విభాగాలు కూడా 100మార్కులకు పరీక్ష నిర్వహిస్తామని అన్నారు. గతంలో వీటికి 60 మార్కులు చొప్పున ఇచ్చేవారు. వీటన్నింటికీ కలిపి తొలి ఏడాది 15 మార్కులు, రెండో ఏడాది 15 మార్కులు ప్రాక్టికల్స్ మార్కులు కేటాయించారు.