Sri Reddy- AP Police: సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేసేవారిని ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల వైసీపీకి అనుకూలంగా పనిచేసిన, మాట్లాడిన సినీనటుడు పోసాని కృష్ణ మురళీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కూటమి పార్టీ మద్దతుదారుడు, ఐ టీడీపీ కార్యకర్తను సైతం మాజీ సీఎం జగన్ భార్య భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు అతని ముఖానికి ముసుగు వేసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాజాగా సినీ నటి శ్రీరెడ్డిని కూడా పోలీసులు విచారణకు పిలిచి వదిలేశారు. ఈ విషయం సామాజిక మాద్యమాల్లో చర్చకు దారితీసింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ తదితర పెద్దనాయకులు సామాజిక మాధ్యమాల్లో బూతులుమాట్లాడేవారిని, కామెంట్లు పెట్టేవారిపై ఉపేక్షించమని అనేక సందర్భాల్లో చెప్పారు. చెప్పడమే కాదు.. అనేక మందిపై కేసులు నమోదు చేసి, పలువురిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. దీంతో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారి సంఖ్య దాదాపు తగ్గిపోయింది. ఇప్పటికీ సోషల్ మీడియా అకౌంట్లను పోలీసులు క్షున్నంగా పరిశీలిస్తున్నారు.
అసభ్యంగా మాట్లాడినా, పోస్టులు పెట్టినా సరే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు ఏపీ పోలీసులు. అంతేకాదు పార్టీలతో సంబంధం లేకుండా కేసులు పెట్టి అరెస్టు కూడా చేస్తున్నారు. రీసెంట్‌గా ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే అతనికి రిమాండ్ కూడా విధించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
గత ప్రభుత్వ హయాంలో తీవ్రమైన పదజాలం, బూతులతో టీడీపీ, జనసేన నేతలపై విరుచుకుపడింది శ్రీరెడ్డి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను, ఆయన కుటుంబ సభ్యులను నీచాతి నీచంగా తిట్టింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గురించి, వారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల గురించి కూడా మాట్లాడింది. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబర్‌లో శ్రీరెడ్డిపై నెలిమర్ల నియోజకవర్గంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే శ్రీరెడ్డి తనను అరెస్టు చేస్తారనే భయంతో పవన్, లోకేష్, చంద్రబాబులను తిట్టినందుకు క్షమించాలని వేడుకుంది. అప్పటి నుంచి ఎలాంటి పోస్టులు పెట్టడం లేదు. రీసెంట్‌గా పవన్ కొడుకు అగ్ని ప్రమాదంలో గాయపడగా.. బాబు కోలుకోవాలని చెబుతూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టింది. ఇక గత నవంబర్‌లో నెలిమర్లలో శ్రీరెడ్డిపై కేసు నమోదు కాగా.. విచారణ నిమిత్తం ఏప్రిల్ 19న విజయనగరం జిల్లా నెలిమర్లకు శ్రీరెడ్డిని పోలీసులు పిలిపించారు.
శ్రీరెడ్డిని విచారించిన తర్వాత పోలీసులు అరెస్టు చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆమెను వదిలేశారు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. అసలు పోలీసులు ఏమడిగారు.. శ్రీరెడ్డి ఏం చెప్పిందో కూడా ఎవరికీ తెలియలేదు. ఏదో అత్తగారింటికి వచ్చి వెళ్లినట్లు శ్రీరెడ్డి అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. పోలీసుల తీరుపై జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నారు. అసలు శ్రీరెడ్డిని ఎందుకు పిలిచారు ఎందుకు వదిలేశారు అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు చర్యలతో అందరూ తలలు పట్టుకుంటున్నారు.
ఇలాంటి వ్యాఖ్యలే చేసిందుకు గుంటూరు జిల్లాకు చెందిన చేబ్రోల్ కిరణ్‌ను దారుణంగా ముఖానికి కవర్ తొడిగి.. అతన్ని మీడియా ముందుకు ప్రవేశపెట్టిన పోలీసులు.. అంతకంటే వందరెట్టు బూతులు తిట్టిన శ్రీరెడ్డిని ఏవిధంగా వదిలేస్తారని కూటమి పార్టీ కేడర్ నేతలు షాక్‌కి గురయ్యారు. ఆడవాళ్లకు ఒక న్యాయం.. మగాళ్లకు ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. శ్రీరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.