కర్నూలు జిల్లాలో మరో స్వాతి కథ

First Published Dec 16, 2017, 2:23 PM IST
Highlights
  • భర్త స్ధానంలో ప్రియుడిని తెచ్చుకునేందుకు ప్రయత్నించి విఫలమైన స్వాతి విషయం ఎంత సంచలనం రేపిందో అందరకీ తెలిసిందే.

భర్త స్ధానంలో ప్రియుడిని తెచ్చుకునేందుకు ప్రయత్నించి విఫలమైన స్వాతి విషయం ఎంత సంచలనం రేపిందో అందరకీ తెలిసిందే. ఆ ఘటనను మరచిపోకయుందే అటువంటి ఘటనే తాజాగా కర్నూలు జిల్లాలో జరిగింది.  కాకపోతే నాగర్ కర్నూలులో స్వాతి లాగ కష్టపడాల్సిన అవసరం లేదనుకుందో ఏమో తెలీదు. అందుకని భర్తను హత్య చేయించేందుకు ఏకంగా కిరాయికి మాట్లాడేసుకుంది. లక్ష రూపాయల కిరాయిలో అడ్వాన్సుగా రూ. 80 వేలు కూడా సమర్పించుకుంది. ప్రియుడు, కిరాయి హంతకులతో కలిసి భర్తను అడ్డుతొలగించుకుంది కానీ విధి వక్రించి చివరకు పోలీసులకు దొరికిపోయింది.

ఇంతకీ విషయం ఏమిటంటే, కర్నూలు జిల్లాలోని పూడిచెర్ల గ్రామంలో మద్దయ్య అనే వ్యక్తి అనుమానాస్పద స్ధితిలో మృతిచెందాడు. పోలీసులు కూడా అదే విధంగా ఫైల్ తయారుచేసారు. అయితే తర్వాతే కథ అడ్డం తిరిగింది. బ్రాహ్మణపల్లెకు చెందిన వడ్డె చిన్నమద్దిలేటి అలియాస్ మద్దయ్య స్వయాన తన అక్క కూతురైన వెంకటేశ్వరిని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం 6 ఏళ్ళ క్రితం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. వివాహమై భర్త దగ్గరకు వచ్చిన వెంకటేశ్వరమ్మకు అదే గ్రామంలోని భాషాతో పరిచయమైంది. తర్వాత సన్నిహితమై వివాహేతర బంధానికి దారితీసింది.

కొంతకాలంగా భార్య వ్యవహారంలో మార్పు గమనించిన మద్దిలేటి వెంకటేశ్వరమ్మను నిలదీసాడు. తమ వ్యవహారం భర్తకు తెలిసిపోయిందని అర్ధం చేసుకున్న భార్య, ప్రియుడు భాషాతో చర్చించింది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని మద్దిలేటి అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం బేతంచర్ల మండలంలోని బలపాలపల్లెకు చెందిన మనోహర్ అనే వ్యక్తితో భాషా మాట్లాడాడు. మద్దిలేటి హత్యకు మనోహర్ పథకం వేసాడు. అందుకు లక్ష రూపాయల కిరాయి కూడా ఖాయం చేసుకున్నారు. అందులో రూ. 80 వేలు ఇచ్చేశారు. ఆ మొత్తం కూడా వెంకటేశ్వరమ్మ  దగ్గర నుండే భాషా ఇప్పించాడు.

పథకం ప్రకారమే హంతకుడు మద్దియ్యతో పరిచయం పెంచుకున్నాడు. ఈనెల 4వ తేదీన మద్దయ్యను మనోహర్ పూడిచెర్ల అనే ఊరికి తీసుకెళ్ళాడు. అక్కడ ఓ మద్యం షాపులో మనోహర్ స్నేహితుడు మరో వ్యక్తి కలిసాడు. ఇద్దరూ కలిసి మద్దయ్యకు ఫుల్లుగా తాగించారు. తర్వాత దాదాపు అపస్మారక స్ధితిలో ఉన్న మద్దయ్యను దూరంగా తీసుకెళ్ళి బండరాళ్ళతో కొట్టి చంపేసారు.

వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు మద్దయ్యది అనుమానాస్పద మృతిగానే పోలీసులు భావించారు. అయితే, విచారణలో చుట్టు పక్కల వాళ్ళిచ్చిన సమాచారంతో పోలీసులు వెంకటేశ్వరమ్మను అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో అసలు విషయం బయటపడింది. తన భర్త అంటే మొదటి నుండి తనకు ఇష్టం లేకపోవటంతోనే తాను హత్యకు పథకం పన్నినట్లు వెంకటేశ్వరమ్మ అంగీకరించటంతో పోలీసులు నివ్వెరపోయారు. సరే, తర్వాత హత్యలో భాగమున్న అందరినీ అరెస్టు చేసారు లేండి.

click me!