కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో ఎదురు దెబ్బ తగలనుంది. దేవినేని అవినాష్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే వల్లభవేని వంశీ టీడీపికి రాజీనామా చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగలనుంది. విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దేవినేని అవినాష్ గత కొద్ది రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. టీడీపీకి రాజీనామా చేసి ఆయన ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశం ఉంది.
Also Read: చంద్రబాబుకు షాక్ ఖాయమేనా...? రామ్ మాధవ్ తో గంటా భేటీ
సాధారణ ఎన్నికల్లో ఆయన కొడాలి నానిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పటికే శాసనసభ్యుడు వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దేవినేని అవినాష్ కూడా పార్టీ నుంచి తప్పుకుంటే కృష్ణా జిల్లాలో, ముఖ్యంగా విజయవాడలో టీడీపీ మరింత బలహీనపడుతుంది.
కొంత కాలంగా అవినాష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు తనను పట్టించుకోవడం లేదని ఆయన మనస్తాపానికి గురవుతున్నట్లు సమాచారం. గుడివాడలో కొడాలి నానిపై తనను బలవంతంగా పోటీ చేయించారని కూడా అంటున్నట్లు సమాచారం. విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లో తన కుటుంబానికి పట్టు ఉంటే గుడివాడ నుంచి పోటీ చేయించారని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీలో చంద్రబాబుకు మరో షాక్: టీడీపీకి సాధినేని యామిని రాజీనామా
గతంలో కూడా అవినాష్ టీడీపీని వీడుతున్నారంటూ ప్రచారం సాగింది. ఆయన త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆయనతో పాటూ ప్రధాన అనుచరుడిగా ఉన్న కడియాల బుచ్చిబాబు, అనుచరులు కూడా పార్టీని వీడుతున్నారని అప్పట్లో భావించారు. అయితే, ఆ వార్తలను అప్పట్లో దేవినేని అవినాష్ ఖండించారు.