Andhra Pradesh: అన్నదాత సుఖీభవ పథకానికి ఎవరు అర్హులు...ఆ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..!

Published : Jun 18, 2025, 01:39 PM IST
Good news for farmers

సారాంశం

ఏపీ అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా రూ.20,000 లబ్ధి. అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలపై పూర్తి వివరాలు.

రైతే దేశానికి వెన్నెముక అనే విషయం తెలిసిందే. కానీ వ్యవసాయం మాత్రం రోజురోజుకూ ఖరీదైన పనిగా మారుతోంది. ఎరువుల ధరలు పెరుగుతున్నాయి, విత్తనాల ధరలు కొండెక్కుతున్నాయి. ఇలా పెరుగుతున్న ఖర్చులను తగ్గించేందుకు, రైతులకు ప్రత్యక్ష సాయాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే ‘అన్నదాత సుఖీభవ’.

గత ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసా పథకం ఆధారంగా దీన్ని తీర్చిదిద్దారు. మునుపటి ప్రభుత్వంలో రైతులకు ఏటా రూ.13,500 సాయం అందించగా, ప్రస్తుత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.20,000కి పెంచింది. ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటి.

ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే..

‘అన్నదాత సుఖీభవ’ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేంద్ర ప్రభుత్వం అందించే PM-KISAN పథకాన్ని అభివృద్ధి చేస్తూ అమలవుతోంది. PM-KISAN కింద కేంద్రం రూ.6,000 ఇస్తే, ఆపై రాష్ట్రం రూ.14,000 జత చేసి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. మొత్తంగా రైతుకు ఏడాదికి రూ.20,000 సాయం లభిస్తుంది. ఈ మొత్తం మూడు విడతల్లో చెల్లిస్తారు.

రైతులే దరఖాస్తు…

ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు కొన్ని అర్హతలు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులే దరఖాస్తు చేసుకోవాలి. ఒక రైతు వద్ద భూమి అయిదు ఎకరాల్లోపు ఉండాలి. ఆయన వయస్సు కనీసం 18 ఏళ్లు ఉండాలి. భూమికి సంబంధించి పక్కా పత్రాలు ఉండాలి. ఆధార్‌తో రైతు వివరాలు అనుసంధానమై ఉండాలి. కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులే, కానీ వారు తప్పనిసరిగా CCR సర్టిఫికెట్ (కౌలు రైతు ధ్రువీకరణ పత్రం) కలిగి ఉండాలి.

నలుగురు ఉన్నా, ఒక్కరికే సాయం…

ఇక ఈ పథకం వర్తించనివారు ఎవరు అన్నది కూడా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఆదాయపన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, నెలకు రూ.10,000కి పైగా పింఛను పొందేవారు ఈ పథకానికి అర్హులు కారు. అంతేకాకుండా ఒకే కుటుంబానికి ఒకరికి మాత్రమే ఈ సహాయం అందుతుంది. అంటే కుటుంబంలో భూమి ఉన్నవారు నలుగురు ఉన్నా, ఒక్కరికే సాయం లభిస్తుంది.

కావాల్సిన పత్రాలు…

పథకానికి దరఖాస్తు చేసేందుకు కావాల్సిన పత్రాలు: ఆధార్ కార్డ్, భూమి పత్రాలు (పట్టా, పాస్‌బుక్, రికార్డు ఆఫ్ రైట్స్), బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్, సర్వే నెంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. దీనితో పాటు ఆధార్‌ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేసి ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి?…

ఇప్పుడు, ఎలా దరఖాస్తు చేయాలి? రైతు తన సమస్త పత్రాలతో గ్రామంలోని రైతు సేవా కేంద్రానికి వెళ్లాలి. అక్కడ సిబ్బంది వివరాలు నమోదు చేసి అధికారులు వాటిని పరిశీలిస్తారు. అవసరమైతే వెబ్‌ల్యాండ్ డేటాలో సరిచూస్తారు. అర్హత కలిగిన రైతుల వివరాలను మండల వ్యవసాయ అధికారికి పంపిస్తారు. వారు ధృవీకరించిన తర్వాత, జిల్లా వ్యవసాయాధికారి అంగీకరిస్తే లబ్ధిదారుల జాబితాలో పేరు చేరుతుంది.

ఈ పథకం కింద ఇచ్చే డబ్బును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో మూడు విడతలుగా రైతు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఇంతలో దరఖాస్తు ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అన్నదీ తెలుసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్ https://annadathasukhibhava.ap.gov.in లో 'Know Your Status' అనే ఆప్షన్‌ ఉంది. అక్కడ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే మీ దరఖాస్తు స్థితి తెలుస్తుంది. అవసరమైతే గ్రామంలోని రైతు సేవా కేంద్రం సిబ్బంది లేదా జిల్లా వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించవచ్చు.

ఈ పథకం ఎంపిక ప్రక్రియ కూడా క్రమబద్ధంగా ఉంటుంది. రైతుల వివరాలను గ్రామ వ్యవసాయ సహాయకులు, మండల వ్యవసాయ అధికారులు కలిసి పరిశీలిస్తారు. వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసిన భూమి వివరాలు సరైనవేనా అనే విషయాన్ని సరిచూస్తారు. అనర్హులుగా ఉన్న రైతులను జాబితా నుంచి తొలగిస్తారు.

2025 సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తు చివరి తేదీ మే 25గా నిర్ణయించారు. మొదట మే 20 వరకు గడువు ఇచ్చినా, ఆ తర్వాత మరి ఐదు రోజులు పొడిగించారు. ఇప్పటికీ దరఖాస్తు చేయని రైతులు గ్రామ రైతు సేవా కేంద్రాలను సంప్రదించి వివరాలు నమోదు చేయాలి.

ఈ పథకం ద్వారా రైతులకు అధికంగా ఆర్థిక భరోసా కలుగుతుంది. విత్తనాల కొనుగోలు, ఎరువులు, డ్రిప్ ఇన్స్టాలేషన్, వ్యవసాయ పనుల నిర్వహణలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రైతు జీవితాన్ని స్థిరంగా ఉంచేందుకు ఇది ఒక పెద్ద దిశగా తీసుకున్న ముందడుగు. ప్రభుత్వం ఆశిస్తున్నదేమిటంటే – రైతు భరోసాతో వ్యవసాయం పట్ల రైతులకు విశ్వాసం మరింత పెరగాలి.

అన్నదాత సుఖీభవ పథకం ఒక రైతు జీవితంలో ఆర్థికంగా నిలబడి ఉండే ఒక సాధనంగా మారుతుందా అనేది పూర్తిగా అమలు తీరుపై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ పథకంలో పెట్టుబడి సహాయం ద్వారా రైతుకు కావలసిన ప్రాథమిక మద్దతు మాత్రం లభించనుంది.

ఇదిలా ఉంటే..

దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతులకు డ్రోన్లు అందిస్తోంది. సాగుకు సాంకేతికతను జోడించి ఖర్చులు తగ్గించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.ఒక్కో డ్రోన్ యూనిట్‌ ధర రూ.9.80 లక్షలు కాగా, రైతులు కేవలం రూ.1.96 లక్షలు మాత్రమే చెల్లించాలి. మిగిలిన రూ.8 లక్షలు ప్రభుత్వం భరిస్తోంది. బ్యాంకుల ద్వారా రైతుల వాటాను రుణంగా మంజూరు చేసి, ఆ మొత్తం డ్రోన్ కంపెనీలకు చెల్లించనుంది.

మొత్తం 875 డ్రోన్ యూనిట్లు…

రాష్ట్రానికి మొత్తం 875 డ్రోన్ యూనిట్లు మంజూరయ్యాయి. ఐదుగురు సభ్యుల రైతు గ్రూపులను లబ్ధిదారులుగా గుర్తించి, వారిలో ఒక్కొక్కరికి డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక శిక్షణ కల్పించింది.ఒక ఎకరంలో డ్రోన్‌ ద్వారా పురుగుమందులు పిచికారీ చేయడానికి కేవలం 7 నిమిషాలే పడుతుంది. అదే పని మనుషులు చేస్తే 2 గంటలకుపైనే అవసరం. డ్రోన్‌ 12 లీటర్ల నీటితో పని చేస్తే, మనుషులు 100 లీటర్ల దాకా వాడాల్సి వస్తుంది.

డ్రోన్‌తో మందు పిచికారీ చేయించేందుకు ఎకరాకు రూ.350 ఖర్చు వస్తుంది. అదే మనుషులైతే కనీసం ఇద్దరు కూలీల ఖర్చు పడుతుంది. డ్రోన్‌ నేరుగా మొక్కలపై మందు చల్లడంతో మందు వృథా తక్కువగా ఉంటుంది.డ్రోన్ల ద్వారా మందుల పిచికారీ వల్ల వ్యవసాయ కూలీల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మానవులుగా చల్లితే ముక్కు, నోరు ద్వారా మందులు శరీరంలోకి చేరి ఊపిరితిత్తులు, జీర్ణాశయం, శ్వాసవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.ఈ డ్రోన్ బరువు ట్యాంకుతో కలిపి 29 కిలోలు ఉంటుంది. ఒకరోజులో 10 ఎకరాల వరకు మందు పిచికారీ చేయగలదు. స్పష్టమైన టార్గెట్‌తో మందులు మొక్కలపై పడటంతో మూడింతల ప్రయోజనం లభిస్తుంది.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే