Tirumala : రేణిగుంట విమానాశ్రయం పేరు మార్పు.. ఏం పెట్టనున్నారో తెలుసా?

Published : Jun 18, 2025, 11:23 AM ISTUpdated : Jun 18, 2025, 01:03 PM IST
Delhi Airport Runway Closure 2025

సారాంశం

తిరుమల తిరుపతి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యమైనది రేణిగుంట విమానాశ్రయం పేరు మార్పు. ఏ పేరు పెట్టనున్నారో తెలుసా?

Tirupati : మీరు కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామి దర్శనంకోసం తిరుమలకు విమానంలో వెళ్లాలంటే రేణిగుంట విమానాశ్రయంలో దిగాల్సిందే. ఇలా తెలుగు రాష్ట్రాల నుండే కాదు దేశ నలుమూలల నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారు కూడా ఈ విమానాశ్రయంలో దిగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే శ్రీవారి పేరు ఈ విమానాశ్రయానికి పెడితే బాగుంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తోంది. ఇందుకోసం ఓ పేరును సిద్దం చేసింది. 

రేణిగుంట అని కాకుండా శ్రీవెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చాలని టిటిడి నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖకు లేఖ రాసేందుకు టిటిడి పాలకమండలి సిద్దమయ్యింది. దీనికి ఆమోదం లభిస్తే రేణిగుంట కాస్త శ్రీ వెంకటేశ్వర విమానాశ్రయంగా మారిపోతుంది.  

తిరుమత తిరుపతి దేవస్థానం బోర్డ్ సమావేశం మంగళవారం ఛైర్మన్ బిఆర్ నాయుడు క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించారు... కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులోనే రేణిగుంట విమానాశ్రయం పేరు మార్పు కూడా ఒకటి.

టిటిడి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే :

టిటిడి పాలకమండలిలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన బిఆర్ నాయుడు మీడియాకు వివరించారు. ఇందులో ముఖ్యమైనవి ఇవే..

1. కేవలం రేణిగుంట విమానాశ్రయం పేరును మార్చడమే కాదు దీన్ని ఆద్యాత్మికంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని తెలిపారు. అంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు విమానాశ్రయం నుండే ఆద్యాత్మిక వాతావరణాన్ని ఫీల్ అయ్యేలా చేస్తామన్నారు. తద్వారా మతపరమైన ఆద్యాత్మికతను, తెలుగు సంస్కృతి దేశ నలుమూలల చాటిచెబుతామని అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఇప్పటికే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందు ఉంచినట్లు తెలిపారు.

2. హిందూ ధర్మ ప్రచార పరిషద్ (HDDP)ద్వారా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేలా ధార్మిక కార్యక్రమాలను నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఇందులో కీలకమైనవి ఇవే.

వ్రతాల శిక్షణ : శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయిస్ ట్రైనింగ్ అకాడమీ (SVETA) ద్వారా వెనకబడిన, మత్స్యకార వర్గాల్లో ఆద్యాత్మికతను పెంచేలా వ్రతాలు, పూజలు ఎలా నిర్వహించాలన్నదానిపై ట్రైనింగ్ ప్రోగ్రామ్ కొనసాగించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకోసం SVETA శిక్షణాకేంద్రాన్ని విస్తరించాలని నిర్ణయించారు.

సద్గమయ : విద్యార్థులలో నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంచేలా టిటిడి నిర్వహించే స్కూళ్లలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు... దీన్ని కొనసాగించాలని నిర్ణయించారు.

సౌభాగ్యం: మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా మహిళల కోసం 2025 ఆగస్టు 8న వ‌రలక్ష్మీ వ్రతం సందర్భంగా వ్రతోత్సవ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.

అక్షరగోవిందం: హిందూ సనాతన ధర్మం ప్రకారం చిన్నారులకు అక్షరాభ్యాసం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చిన్నారులపై శ్రీవారి ఆశిస్సులు ఉండేలా చదువుకు సంబంధించిన కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

హరికథా వైభవం: సంప్రదాయ గాథల ప్రాచుర్యం కోసం హరికథా పారాయణాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు.

భగవద్గీత అనుష్ఠాన బోధన: యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచేందుకు భగవద్గీతలోని అంశాలను పరిచయం చేయాలని నిర్ణయించారు.

భజే శ్రీనివాసం: తెలుగు, తమిళం, కన్నడ భజనలపై శిక్షణ.

వననిధి: తిరుమలలో పచ్చదనం పెంపొందించేందుకు మొక్కల నాటాలని నిర్ణయించారు. ప్రస్తుతం 68 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 80 శాతానికి పెంచేలా చర్యలు చేపట్టనున్నారు

గిరిజనార్థం కళ్యాణాలు: గిరిజన ప్రాంతాల్లో శ్రీనివాస కళ్యాణాల నిర్వహించాలని నిర్ణయం.

సన్మార్గం: ఖైదీలలో నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమం.

ఇక జూన్ 21, 2025న తిరుపతిలో టిటిడి పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వైభవంగా నిర్వహించాలని టిటిడి బోర్డు నిర్ణయించింది.

టిటిడి పాలకమండలి కీలక తీర్మానాలు :

బెంగళూరులో శ్రీవారి ఆలయం : ఇటీవల టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన శ్రీనివాస కల్యాణం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డికె శివకుమార్ ను కలిసారు.. ఈ సదర్భంగానే బెంగళూరులోని కీలక ప్రాంతంలో శ్రీవారి ఆలయం నిర్మించాలనే అంశం చర్చకు వచ్చింది. దీనిపై కూడా టిటిడి పాలకమండలి చర్చించింది.. భూమిని కేటాయించగానే ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు.

తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు : కేంద్ర పారిశ్రామిక శాఖ మంత్రి కుమారస్వామి తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు హామీ ఇచ్చారు. తిరుమలలో పర్యావరణాన్ని కాపాడే ఇలాంటి ఈవి బస్సులనే భక్తులకోసం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని టిటిడి నిర్ణయం.

తిరుమలలో CSIR Lab : కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో సిఎస్ఐఆర్ ల్యాబ్ ఏర్పాటుకు ముందుకువచ్చింది. ఈ క్రమంలోనే టిటిడి స్థలాన్ని ఈ ల్యాబ్ ఏర్పాటుకోసం లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. తిరుమలలో ఉపయోగించే నెయ్యితో పాటు మంచినీరు, అహార పదార్ధాలను ఈ ల్యాబ్ లో టెస్ట్ చేయనున్నారు.

ఎస్వీ కాలేజ్ అధునీకరణ : దేశ రాజధాని న్యూడిల్లీలో 73 ఏళ్లుగా టిటిడి శ్రీ వెంకటేశ్వర కాలేజీని నిర్వహిస్తోంది. దీన్ని అధునీకరించి మరింత నాణ్యమైన విద్యను అందించేలా తీర్చిదిద్దాలని టిటిడి నిర్ణయించింది.

టిటిడి కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు : టిటిడి పరిధిలోని విద్యాసంస్థల్లో పనిచేసే 200 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్య పరిష్కారానికి నూతన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విధంగా ధార్మిక, సాంస్కృతిక, విద్యా, పర్యావరణ, సామాజిక రంగాల్లో టిటిడి చేపట్టిన పలు నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడనున్నాయి. అలాగే భక్తులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు ఆద్యాత్మికతను పెంచేలా, సామాజిక సేవా కార్యమాలను నిర్వహించేలా టిటిడి పాలకమండలి నిర్ణయాలు ఉన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?