అయిదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. పేదలకు రూ.5కే నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అందించనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 203 అన్నా క్యాంటీన్లను ప్రారంభించినప్పటికీ 183 క్యాంటీన్లు మాత్రమే ఫంక్షనింగ్‌లోకి వచ్చాయన్నారు. వాటి ద్వారా రోజుకు దాదాపు 2 లక్షల 25 వేల మంది భోజనం తినేవారని తెలిపారు. మిగిలిన 20 క్యాంటీన్లలో 18 క్యాంటీన్ల భవనాలు పూర్తవ్వగా, 2 క్యాంటీన్ల భవనాలు ప్రాథమిక దశలోనే నిలిచిపోయాయని వెల్లడించారు.
అయితే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను అన్నింటినీ మూసేసి వాటిలో కొన్నింటిని వార్డు సచివాలయాలుగా, మరికొన్నింటిని స్టోరేజ్ రూములుగా వినియోగంచుకుందని మంత్రి నారాయణ తెలిపారు. ఆయా భవనాలన్నింటినీ పూర్తి స్థాయిలో క్యాంటీన్లుగా తీర్చిదిద్దేందుకు, అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణ పనులను వచ్చే నెల 10వ తేదీ లోపు పూర్తి చేసేందుకు టెండర్లను కూడా ఖరారు చేశామన్నారు. గతంలో అక్షయ పాత్ర సంస్థ ఎంతో చక్కగా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసేదని, అదే తరహాలో అదే రేట్లకు ఈసారి కూడా ఆహారాన్ని సరఫరా చేసేందుకు టెండర్లను కూడా స్వీకరించిందని తెలిపారు. వాటిని ఈ నెల 22వ తేదీన ఓపెన్ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
undefined
కాగా, అయిదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం గతంలో రూ.5కే నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ అమలు కావడంతో వేలాది మంది సద్వినియోగం చేసుకున్నారు. కూడళ్లలో మూడు పూటలా రూ.5 చొప్పున ఆహారం అందించడంతో తక్కువ కాలంలోనే పేదలకు చేరువయింది. కాగా, అన్నా క్యాంటీన్లకు అక్షయ పాత్ర సంస్థ ద్వారా ప్రభుత్వం ఆహారం అందించింది. ఇందుకోసం మూడు పూటలా భోజనానికి రోజుకు రూ.73 చొప్పున చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఆ సంస్థకు చెల్లించింది. మూడు పూటలా తిన్నవారు రూ.15 రూపాయలు చెల్లించగా... మిగిలిన రూ.58 రాయితీని ప్రభుత్వం చెల్లించింది.
కాగా, 2014 నుంచి 2019 మధ్య కాలంలో అన్నా క్యాంటీన్లలో రోజుకు 2.25 లక్షల మంది భోజనం తిన్నారు. ఐదేళ్లలో మొత్తం 4 కోట్లు 60 లక్షల 31 వేల 600 ప్లేట్ల భోజనాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా పంపిణీ చేశారు. కాగా, ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కాబోతుండటంతో పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.