తిరుమల లడ్డు తయారీలో అన్యమతస్తులు ... నిజమెంత..? అసలు వీటిని ఎవరు, ఎలా తయారుచేస్తారు..!

By Arun Kumar P  |  First Published Jul 18, 2024, 6:59 PM IST

తిరుమల లడ్డు తయారీపై వివాదం సాగుతోంది.  ఈ క్రమంలో అసలు ఈ లడ్డులను ఎవరు, ఎలా తయారుచేస్తారు..? ఇంత రుచికరంగా వుండటానికి కారణమేంటి? అనేది తెలుసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు.... శ్రీవారి లడ్డు చరిత్రను పరిశీలిద్దామా... 


Tirumala Laddu : కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామి కొలువైన పవిత్ర క్షేత్రం తిరుమల. స్వామివారు అలంకారప్రియుడే కాదు నైవేద్యప్రియుడు కూడా. అందువల్లే శ్రీవారికి ఎంతో ఇష్టమైన లడ్డును నైవేద్యంగా పెట్టడమే కాదు భక్తులకు ప్రసాదంగా అందిస్తుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్. శ్రీవారిని దర్శించుకునేవారు తప్పుకుండా లడ్డును రుచిస్తుంటారు... ఇంటికి పట్టుకెళ్లి బంధువులకు, స్నేహితులకు అందిస్తుంటారు. ఇలా స్వామివారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదాన్ని అనాదిగా ఎంతో నిష్టతో చేస్తుంటారు... అందుకే దీనికా పవిత్రత, ప్రత్యేకత.   

అయితే తాజాగా తిరుమల లడ్డుపై ఓ ప్రచారం జరుగుతోంది. ఇటీవలకాలంలో లడ్డు ప్రసాదం నాణ్యత తగ్గిందని... ఇతర మతాలకు చెందినవారు దీన్ని తయారుచేస్తున్నారని ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇలా తిరుమల సాంప్రదాయం ప్రకారం శ్రీవారి లడ్డును వైష్ణవ బ్రాహ్మణులు కాకుండా ఇతరులు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అన్యమతానికి చెందిన థామస్ అనే కాంట్రాక్టర్ల పర్యవేక్షణలో ఈ లడ్డు తయారీ జరుగుతోందన్న ప్రచారంపై టిటిడి రియాక్ట్ అయ్యింది. 

Latest Videos

undefined

తిరుమలకు వచ్చే భక్తులకు అందించే లడ్డును స్వచ్చతతోనే చేస్తున్నామని... ఇతర  మతాలవారిని దీని తయారీలో ఉపయోగించడంలేదని టిటిడి ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి లడ్డను వైష్ణవ బ్రాహ్మణులే చేస్తున్నారని ...సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని టిటిడి తెలిపింది. ముడి సరుకుల సేకరణ దగ్గరనుడి బూందీ తయీరి, లడ్డు కట్టడం వంటి పనులన్ని హిందూ మతానికి చెందిన సిబ్బంది మాత్రమే చేస్తారని తెలిపారు. ఇలా తిరుమల లడ్డు తయారీకోసం మొత్తం 980 మంది పనిచేస్తారని... అందరూ హిందువులే... ఈ విషయంలో ఎలాంటి తప్పుడు  ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులకు టిటిడి తెలిపింది.  

శ్రీవారి లడ్డు తయారి :  

తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రతిరోజు లక్షల్లో భక్తులు వస్తుంటారు. కొందరు కాలినడకన, మరికొందరు వాహనాల్లో ఏడుకొండలపైకి చేరుకుని శ్రీవారి దర్శించుకుని తరిస్తారు. ఇలా స్వామివారిని కనులారా చూసి ఎలాగైతే ఆనందిస్తారో... లడ్డూ ప్రసాదంతో నోరు తీపి చేసుకుని అంతటి మధురానుభూతినే పొందుతారు భక్తులు. ఇలా మెత్తటి బూందీ, స్వచ్చమైన నెయ్యి, జీడిపప్పు, ఎండుద్రాక్షలతో తయారయ్యే తిరుపతి లడ్డు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. ఇలా భక్తికి భక్తి, రుచికి రుచి కలిగివుండటంతో శ్రీవారి లడ్డు భక్తులకు ఎంతో ఇష్టమైనదిగా మారింది. 

దిట్టం : 
 
తిరుపతి లడ్డును తయారుచేసేందుకు ముడిసరుకులను పక్కా కొలతలతో ఉపయోగిస్తారు. ఏ పదార్థం ఎంత మోతాదులో వాడాలో తెలియజేసేదే దిట్టం. దీని ప్రకారమే తిరుమల లడ్డూ తయారీకి శనగపిండి, జీడిపప్పు, యాలకులు, ఆవు నెయ్యి, చక్కెర,  ఎండుద్రాక్షలు, కలకండ ఉపయోగిస్తారు. 

1950 లో మొదటిసారిగా లడ్డూల తయారీ కోసం దిట్టం నిర్ణయించారు. కాలానుగుణంగా తిరుమలకు భక్తులరాక పెరగడం... ఆలయం అభివృద్ది చెందడంతో దిట్టంలో కూడా మార్పులు జరిగాయి.  చివరిసారిగా 2001 లో దిట్టం నిర్ణయించారు... దీని ప్రకారమే ప్రస్తుతం లడ్డుల తయారీ జరుగుతోంది.

దిట్టం ప్రకారం 5,100 లడ్డూల తయారీకి 803 కిలోల ముడి సరుకులను ఉపయోగిస్తారు. శనగపిండి 180 కిలోలు, ఆవు నెయ్యి 165 కిలోలు, చక్కెర 400 కిలోలు, జీడిపప్పు 30 కిలోలు,  ఎండు ద్రాక్ష 16, కలకండ 8 కిలోలు, యాలకులు 4 కిలోలు ఉపయోగిస్తారు.   

అయితే ఈ లడ్డూల తయారీలో వైష్ణవ బ్రాహ్మణులదే కీలక పాత్ర. అనాదిగా బూంది తయారి నుండి లడ్డులు కట్టేవరకు వీరు సాంప్రదాయబద్దంగా ఆచారాలను పాటిస్తుంటారు. ఎంతో పవిత్రంగా భావించే లడ్డూల తయారీ కూడా అంతే పవిత్రంగా జరుగుతుంది.
 
పోటు (లడ్డుల తయారీ జరిగే వంటశాల) : 

తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో లడ్డులను తయారుచేసే వంటశాల వుంది. దీన్ని పోటు అంటారు. గతంలో కట్టెల పొయ్యిపై లడ్డులు, ఇతర పదార్థాలు తయారుచేసేవారు...కానీ ప్రస్తుతం ఆధునిక సామాగ్రిని ఉపయోగిస్తున్నారు. ఇక ఈ పోటులో తయారుచేసిన లడ్డూలను భక్తులకు విక్రయించే కౌంటర్లకు తరలించేందుకు కన్వెయర్ బెల్టులు ఉపయోగిస్తున్నారు.  

ఈ పోటులో ప్రతినిత్యం లడ్డూల తయారి జరుగుతుంటుంది. ఈ పోటు గరిష్ట సామర్ధ్యం 8 లక్షల లడ్డూల తయారీ... కానీ ప్రతిరోజు భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకుని 2 నుండి 3 లక్షల లడ్డూలు తయారుచేస్తారు. బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక రోజుల్లో ఎక్కువ లడ్డులును తయారుచేస్తుంటారు.    

తిరుమల లడ్డుకు పేటెంట్ : 

తిరుమల లడ్డు చాలా ప్రత్యేకమైనది. ఈ రుచి మరెక్కడా దొరకదు. దీంతో ఈ లడ్డుకు టిటిడి పేటెంట్ తీసుకుంది. 2009 లో తిరుమల లడ్డుకు పేటెంట్ లభించింది. దీంతో ఇతరులెవ్వరూ తిరుమల పేరుతో లడ్డుల తయారీ నిరోధించబడింది.  

తిరుపతి లడ్డూ  రకాలు :    

ప్రోక్తం లడ్డు : 

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఈ లడ్డును అందిస్తారు. ఇది చిన్న పరిమాణంలో అంటే 60 నుండి 75 గ్రాముల బరువు వుంటుంది. పోటులో ఎక్కువగా ఈ లడ్డుల తయారే జరుగుతుంది. 

ఆస్థానం లడ్డు : 

ప్రత్యేక పర్వదినాల సమయంలో ప్రత్యేకంగా తయారుచేసే లడ్డూ ఇది. ఇది చాలా పెద్దగా అంటే 750 గ్రాముల వరకు వుంటుంది. ఇందులో జీడిపప్పు, బాదం మరియు ఇతర పదార్థాలు బాగా దట్టించి తయారుచేస్తారు. 

కల్యాణోత్సవం లడ్డు :

ఈ లడ్డూను కల్యాణోత్సవం మరియు కొన్ని ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు పంచుతారు. ఈ లడ్డూలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రోక్తం లడ్డూతో పోల్చినప్పుడు ఇవి చాలా తక్కువ సంఖ్యలో తయారు చేయబడతాయి.  
 

click me!