Latest Videos

ఆంధ్రాలో అన్నా క్యాంటీన్లు రీఎంట్రీ.. టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం ధర ఎంతంటే..?

By Galam Venkata RaoFirst Published Jun 16, 2024, 8:56 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. మరో మూడు వారాల్లో తిరిగి ప్రారంభించేలా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంత ధరకు అందించబోతున్నారంటే..?

నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. పట్టణాలు, నగరాల్లో రద్దీగా ఉండే కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ల ద్వారా నిత్యం వేలాది మంది ఆకలి తీర్చుకున్నారు. రూ.5కే రుచికరమైన, నాణ్యమైన భోజనం దొరకడంతో తక్కువ కాలంలో ఎక్కువ మంది పేద ప్రజలు, కార్మికులు, రోజువారీ కూలీలకు అన్నా క్యాంటీన్లు చేరువయ్యాయి. 

అయితే, జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లు కనిపించకుండా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్లను తొలగించేశారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లకు నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేశారు. ఈ వ్యవహారాన్ని తెలుగుపార్టీ తీవ్రంగా ఖండించింది. పేద ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, ఐదేళ్లు గిర్రున తిరిగాయి. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వాటిని తిరిగి ప్రారంభిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 

తాజాగా బాధ్యతలు చేపట్టిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ... అన్నా క్యాంటీన్ల రీఎంట్రీ గురించి గుడ్‌ న్యూస్‌ చెప్పారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అన్నా క్యాంటీన్ల పునరుద్దరణపై మున్సిఫల్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.  నిరుపేదలకు రూ.5కే ఉదయం టిఫిన్‌, రూ.5కే మధ్యాహ్న భోజనం, రూ.5కే రాత్రి భోజనం అందజేసే అన్నా క్యాంటీన్లను మూడు వారాల్లో పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా చేసిన ఐదు సంతకాల్లో  అన్నా క్యాంటీన్ల పునరుద్దరణ ఫైల్ కూడా ఉందని గుర్తుచేశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 203 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినప్పటికీ 184 క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. మిగిలిన 19 క్యాంటీన్లు నిర్మాణ దశలో ఉండిపోయానని చెప్పారు. గత  ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. 

అసలు ఖర్చు ఇంతా..?
గతంలో అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థకు అప్పగించారు. మూడు పూటలా ఆహారం అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోజుకు రూ.73 చెల్లించేది. ప్రజలకు మాత్రం అన్నా క్యాంటీన్ల ద్వారా రోజుకి కేవలం రూ.15కే మూడు పూటలా ఆహారం అందజేశారు. మిగిలిన రూ.58 రాయితీగా ప్రభుత్వమే భరించింది. ఇలా రోజుకి 2.25 లక్షల మంది అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం చేసే వారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. టీడీపీ హయాంలో మొత్తం 4 కోట్లు 60 లక్షల 31 వేల 600 ప్లేట్ల భోజనాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా పంపిణీ చేసినట్లు లెక్కలు ఉన్నాయి. తొలుత మున్సిపల్ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. ఆ క్యాంటీన్లకు ప్రజల ఆదరణ ఎంతగానో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలు కోరారు. అలా గ్రామీణ ప్రాంతాలకు కూడా మరో 150 అన్నా క్యాంటీన్లను ముంజూరు చేసింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. త్వరలోనే తిరిగి అన్నా క్యాంటీన్లు తెరుచుకోనుండటంతో రూ.5కే భోజనం దొరుకుతుందన్న ఆనందం పేదల్లో వ్యక్తమవుతోంది.
 

click me!