జగన్ లెక్కలన్నీ తేలుస్తాం... ఆరోగ్యశ్రీలో అక్రమాలను వదలబోమంటున్న మంత్రి సత్యకుమార్ యాదవ్

Published : Jun 16, 2024, 05:58 PM IST
జగన్ లెక్కలన్నీ తేలుస్తాం... ఆరోగ్యశ్రీలో అక్రమాలను వదలబోమంటున్న మంత్రి సత్యకుమార్ యాదవ్

సారాంశం

జగన్ ప్రభుత్వం అత్యంత ప్రధానమైన ఆరోగ్య రంగాన్ని ఎంతో నిర్లక్ష్యం చేసిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. నేషనల్ హెల్త్ మిషన్‌తో పాటు పలు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కూడా దారి మళ్లించిందని ఆరోపించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు...

ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్‌ యాదవ్‌ బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలోని ఆయనకు ఛాంబరులో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కుటుంబ సభ్యులు, అధికారులతో కలిసి పదవీ బాధ్యతలు చేపట్టారు. క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టేందుకు రాష్ట్రంలోని 5.30కోట్ల మంది స్క్రీనింగ్‌ పరీక్షలు చేసే ఫైల్‌పై తొలి సంతకం, 18ఏళ్లలోపు విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం కింద స్క్రీనింగ్ చేసే ఫైల్‌పై రెండో సంతకం చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌... క్యాన్సర్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేలా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు అన్ని  ప్రభుత్వాసుపత్రుల్లో ఎయిమ్స్ తరహాలో మెరుగైన వైద్య సేవలు అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందుకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపర్చడంతో పాటు సిబ్బందినీ సమకూర్చబోతున్నట్లు తెలిపారు. 

మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఇంకా ఏమన్నారంటే...
‘‘ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ మరణిస్తున్నారు. ఏటా సగటున 48వేల మంది కేన్సర్ మహమ్మారి బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఓరల్, బ్రెస్టు, సర్వైకల్ క్యాన్సర్ల నివారణపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించడంతో పాటు క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించి వైద్య సేవలందించాలనే లక్ష్యంతో 5.30  కోట్ల ప్రజలకు మందికి స్క్రీనింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంటూ తొలి సంతకం చేశా. ఇందులో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించేందుకు ఏఎన్ఎంలు, ఆశాలు, ఇతర అంబాసిడర్లకు హోమీ బాబా కేన్సర్ ఇన్ స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇప్పిస్తాం. అలాగే, 18 ఏళ్లలోపు విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం కింద స్క్రీనింగ్ చేసే ఫైల్‌పై మరో సంతకం చేశా.’’
 
‘‘అత్యంత ప్రధానమైన ఆరోగ్య రంగాన్ని గత ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యం చేసింది. నేషనల్ హెల్త్ మిషన్‌తో పాటు పలు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కూడా దారి మళ్లించింది. ఈ విషయంలో కోర్టులు మొట్టికాయలు మొట్టినా, కేంద్రం పెనాల్టీ వేసినా గత ప్రభుత్వం నిర్లక్ష్య దోరణిలో వ్యవహరించింది. ఆరోగ్య శ్రీ పథకాన్ని కూడా నీరుగార్చేలా అమలుపర్చారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోకుండా అనుబంద ఆసుపత్రులను అభివృద్ది పర్చకుండా, మౌలిక వసతలు కల్పించ కుండా తొందరపాటు చర్యగా  రాష్ట్రంలో వైద్య కళాశాలను మంజూరు చేశారు. ఆరోగ్య శ్రీలో గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ సరిచేసి.. రాష్ట్రాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతాం’’ అని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu